న్యూఢిల్లీ, జనవరి 9 : భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రిలయన్స్ జియో సిద్ధమవుతున్నది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ టెలికాం సంస్థ.. ఈ ఏడాది ఎలాగైనా పబ్లిక్ ఇష్యూకు రావాలన్న అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నది. నిజానికి 2019లోనే జియో ఐపీవోకు ముకేశ్ ప్రణాళికలు వేశారు. అయితే కంపెనీ విలువ పెరిగేదాకా ఆగితే మంచిదన్న అభిప్రాయాలతో వెనుకకు తగ్గారు. అయితే ఇదే సరైన సమయమని ఇప్పుడు భావిస్తున్న అంబానీ.. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో జియో షేర్లను స్టాక్ మార్కెట్లలోకి ఎక్కించాలని చూస్తున్నారు. కాగా, పబ్లిక్ ఇష్యూలో 2.5 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తున్నట్టు సమాచారం. దీని విలువ ఏకంగా రూ.40,000 కోట్లపైనే (4.5 బిలియన్ డాలర్లు) కావడం గమనార్హం. ఇప్పటిదాకా ఈ స్థాయిలో నిధుల సమీకరణ అనేదే జరుగలేదు. దీంతో పబ్లిక్ ఇష్యూలలో జియో ఐపీవోను బాహుబలిగా అభివర్ణిస్తున్నారంతా. అన్నీ కుదిరితే జూన్‌కల్లా జియో ఐపీవో రావచ్చన్న అంచనాలైతే ఉన్నాయి.
ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జెఫ్రీస్.. గత ఏడాది నవంబర్‌లో రిలయన్స్ జియో విలువను రూ.16.2 లక్షల కోట్లు (180 బిలియన్ డాలర్లు)గా అంచనా వేసింది. దీని ప్రకారం ఐపీవో ద్వారా అమ్మాలనుకుంటున్న 2.5 శాతం వాటా విలువ 4.5 బిలియన్ డాలర్లుగా తేలుతున్నది. డాలర్‌తో పోల్చితే ప్రస్తుతం రూపాయి మారకం విలువ ప్రకారం.. ఇది రూ.40,000 కోట్లపైనే. అయితే కొన్ని బ్యాంకులు జియో వ్యాపారం విలువను 200 బిలియన్ డాలర్ల నుంచి 240 బిలియన్ డాలర్ల వరకు లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే పబ్లిక్ ఇష్యూలో నిధుల సమీకరణ ఎంత? ఉంటుందన్న దానిపై ఇప్పుడే స్పష్టత రాకుండా ఉన్నది. ఐపీవో పరిమాణానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచీ అనుమతులు రావాల్సి ఉన్నదని అంటున్నారు.
దేశంలో ఇప్పటిదాకా భారీ ఐపీవో రికార్డు దక్షిణ కొరియా ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్ పేరిటనే ఉన్నది. గత ఏడాది వచ్చిన ఈ పబ్లిక్ ఇష్యూ విలువ 3.3 బిలియన్ డాలర్లు. జియో ఐపీవో వస్తే.. ఇది రెండో స్థానానికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక దేశవ్యాప్తంగా జియో వినియోగదారులు 500 మిలియన్లకుపైగానే ఉన్నారు. దేశీయ టెలికాం రంగంలో అగ్రగామి సంస్థగా కూడా కొనసాగుతున్నది. ఇప్పటికే కృత్రిమ మేధలోకీ ప్రవేశించిన జియో.. కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్, ది అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వంటి ప్రముఖ విదేశీ సంస్థాగత మదుపరుల నుంచి పెట్టుబడులనూ అందుకున్నది. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఎన్విదియాతో కలిసి జియో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్‌తో జియో భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్నది విదితమే.