హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆదివారం ఉదయం విడుదలయ్యాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఒక్కరోజులోనే ఏప్రిల్ నెల టికెట్ల కోటా దాదాపుగా పూర్తయింది. టీటీడీ అధికారిక వెబ్సైట్లో సేవా టికెట్లు కొనుగోలు చేయాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని
సూచించింది.
శ్రీవారిని దర్శించుకొన్న ప్రముఖులు
శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, ఎల్ మురుగన్, ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ దంపతులు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం టీటీడీ అధికారులు రంగనాయకుల మండపంలో వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.