న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: బంగారం ధర దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గడంతోపాటు రూపాయి బలపడటంతో పుత్తడి ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. దీంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.910 తగ్గి రూ.52,360 వద్ద నిలిచింది. మంగళవారం ఈ ధర రూ.53,280గా ఉన్నది. పసిడితోపాటు వెండి ఏకంగా రూ.2,220 తగ్గి రూ.67,960కి దిగొచ్చింది. అంతకుముందు రోజు ఇది రూ.70 వేలుగా ఉన్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 29 పైసలు పెరిగి 76.20కి చేరుకోవడం, క్రూడాయిల్ ధరలు క్రమంగా తగ్గుతుండటం కూడా గోల్డ్ ధర తగ్గడానికి ప్రధాన కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,942.5 డాలర్లకు, వెండి 24.94 డాలర్ల వద్ద ఉన్నది.