న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16:హైదరాబాదీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నుంచి రెండు ఫార్మా బ్రాండ్లను ఢిల్లీకి చెందిన మ్యాన్‌కైండ్ ఫార్మా కొనుగోలు చేయనుంది. ఆస్థమా చికిత్సకు వాడే ‘కాంబిహేల్’, పసిపిల్లలకు ఉపయోగించే సోప్లెస్ మాయిశ్చరైజర్ బార్ ‘డాఫీ’ బ్రాండ్ల కొనుగోలుకు ఒక ఒప్పందంపై సంతకాలు జరిగినట్టు మ్యాన్‌కైండ్ ఫార్మా బుధవారం తెలిపింది. కాంబిహేల్ మార్కెట్ విలువ రూ. 900 కోట్లు, డాఫీకి విలువ రూ. 1,000 కోట్లుగా ఉందని కంపెనీ వెల్లడించింది. ఇరు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్‌లో ఈ రెండు ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, పంపిణీ హక్కుల్ని మ్యాన్‌కైండ్ పొందుతుంది. 2022 మార్చికల్లా బ్రాండ్ల బదిలీ జరుగుతుంది.