ముకరంపుర, జనవరి 31: సాగుకు అనుకూలంగా లేని, బంజరు భూముల్లో రైతులు సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి మంచి ఆదాయం పొందవచ్చని ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేష్ బాబు పేర్కొన్నారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి, అర్హత గల రైతుల నుంచి పేర్ల నమోదు, ఆసక్తి వ్యక్తీకరణకు టీజీ రెడ్కో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు 3.5ఎకరాల నుంచి 4 ఎకరాల భూమి అవసరమని తెలిపారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీజీఈఆర్సీ) నిర్ణయించిన టారిఫ్ ప్రకారం ప్లాంటు లో ఉత్పతైన విద్యుత్తును టీజీ ఎన్పీడీసీఎల్,కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. బంజరు భూముల్లో సోలార్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని ఆదాయ వనరులుగా మార్చుకోవాలని కోరారు. ప్లాంట్ ద్వారా రైతులు 25 ఏళ్ళ పాటు నిలకడైన ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు.
రైతులు, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, రైతు సమూహాలు, నీటి వినియోగదారుల సంఘాలు, సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలు, పంచాయితీలు, గ్రామ సంస్థలు, మండల సమాఖ్యలు, డెవలపర్లు (రైతుల భూమి లీజు ఒప్పందం ద్వారా) ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసే భూములు 33/11 కేవీ సబ్ స్టేషన్ కు సమీపంలో ఉండాలని తద్వారా లైన్ ఖర్చులు తక్కువగా అవుతాయని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
మరిన్ని వివరాలు, దరఖాస్తు నమోదు కోసం ww.tgredco.telangana.gov.in . వెబ్ సైట్ లో లాగిన్ కావాలని కోరారు. ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. టీజీ రెడ్కో డీజీఎం సెల్ నెంబర్ 6304903933, జీఎం – 9000550974 నంబర్లలో సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.