కొత్తగూడెం, సింగరేణి ఆగస్టు 25: సింగరేణిలో177 ఎక్స్టర్నల్ జూనియన్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ పక్కాగా పారదర్శకంగా జరుగుతుందని, యువత దళారుల మాటలు నమ్మిమోసపోవద్దని సంస్థ డైరెక్టర్ (పర్సనల్, ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్ గురువారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. పోస్టుల భర్తీలో ఎలాంటి సిఫార్సులు పనిచేయవన్నారు. పరీక్షకు 1.02 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఈనెల 28 నుంచి అభ్యర్థులు హాల్టెక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.
నియామక ప్రక్రియపై అవగాహన లేకపోవడం కారణంగా కొందరు నిరుద్యోగులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారన్నారు. డబ్బులు దండుకోవడానికి వచ్చిన వారి సమాచారాన్ని సింగరేణి విజిలెన్స్ అధికారులకు తెలియజేయాలని లేదా 94911 45075లో సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. యువకులను మోసం చేసే వారిపై అవసరమైతే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.