Seethakka | హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : కోట్ల మంది గ్రామీణ మహిళల పొదుపు సొమ్ముతో ముడిపడి ఉన్న స్త్రీ నిధి సంస్థలో ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు చర్చనీయాంశమయ్యాయి. మహిళా సాధికారతకు అద్దం పట్టాల్సిన సంస్థ.. అక్రమ నియామకాలు, నిబంధనల ఉల్లంఘనలకు కేంద్ర బిందువుగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. సంస్థలో ఎలాంటి అవకతవకలు జరుగలేదని, ఒక ఉద్యోగిని కూడా తొలగించలేదని స్వయంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక సమర్థించుకోవడం వివాదాస్పదంగా మారిం ది. స్త్రీ నిధిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై, ప్రస్తుత ఎండీ విద్యాసాగర్రెడ్డిపై విచారణ కోసం స్వయంగా మంత్రి సీతక్క జీవో 523 జారీచేశారు.
సొంతంగా విచారణకు ఆదేశించి, ఇప్పుడు బయటకు వస్తున్నవన్నీ అసత్య ఆరోపణలే అని మంత్రి అనడం ఆమె ద్వంద్వ వైఖరికి నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి. 2018 నుంచి ఇప్పటివరకు దాదాపు 450 మంది ఉద్యోగులను ట్రాన్స్ఫర్లు, టర్మినేషన్ల పేరుతో వేధించి సంస్థ నుంచి సాగనంపారు. మరో 20 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. స్త్రీ నిధి రికార్డులే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కానీ, ఇటీవల జరిగిన ‘స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు’ కార్యక్రమంలో ‘ఒకరినీ తొలగించలేదు’ అన్న మంత్రి సీతక్క వ్యాఖ్యల వెనుక డొల్లతనం బయటపడిందనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లలో కన్సల్టెన్సీల పేరుతో, ఎలాంటి రాత పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా బంధువులను, సన్నిహితులను నియమించుకోవడానికి తెరలేపారనే ఆరోపణలున్నాయి.
గడిచిన 14 సంవత్సరాలలో స్త్రీ నిధి పేద మహిళలకు ఇచ్చిన మొత్తం రుణాలు ఎన్ని? అలాగే రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన రుణాలు ఎన్ని? అనే విషయాలపై ప్రభుత్వం తక్షణమే పూర్తిస్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలి. కోటి మందిని కోటీశ్వరులను చేస్తామని నమ్మబలికి, క్షేత్రస్థాయిలో కోటి మంది మహిళల సొమ్మును లూటీ చేస్తున్న సూత్రధారులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, వారికి మంత్రి సీతక అండగా నిలవడం తగదు. స్త్రీ నిధి సంస్థ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.