కొత్తగూడెం సింగరేణి/రుద్రంపూర్, మే 18 : బొగ్గు ఉత్పత్తిలో ముందు వరుసలో ఉంటూ లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణి సంస్థలో మళ్లీ ‘గోల్డెన్ షేక్ హ్యాండ్'(స్వచ్ఛంద ఉద్యోగ విరమణ) అంశం తెరపైకి రావడం కార్మిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సంస్థలో కార్మికుల సంఖ్య తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నదని, అందుకే ఈ పథకాన్ని మళ్లీ అమలు చేసే ప్రయత్నాలు చేస్తున్నదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేసిన విజన్-2020 విధానంతో సింగరేణి సంస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. ఆ సమయంలో 1,12,000 మంది కార్మికులు ఉంటే ‘గోల్డెన్ షేక్ హ్యాండ్’ పథకం ద్వారా వారిని 60 వేలకు కుదించారని, ఇప్పుడు రేవంత్ స ర్కార్ కొనసాగిస్తున్నదని మండిపడుతున్నారు.
చంద్రబాబు బాటలోనే..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన రాజకీయ గురువు ఏపీ సీఎం చంద్రబాబు బాటలోనే నడుస్తున్నాడని కార్మికుల్లో చర్చ నడుస్తున్నది. సింగరేణిలో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెడికల్ బోర్డును రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిర్వహించకుండా ఆపివేశారు. మెడికల్ బోర్డు ద్వారా ఇన్ వాలిడేషన్ అయిన కార్మికుల డిపెండెంట్లు 400 మందికి అన్ని పరీక్షలు పూర్తయి, ఆఫీస్ ఆర్డర్ కోసం ఏడాది నుంచి ఎదురుచూస్తున్నారు. ఇవన్నీ పరిశీలించిన కార్మికులు గురువు బాటలోనే రేవంత్‌రెడ్డి సింగరేణిని ఆగం చేసేందుకు కుట్రలు చేస్తున్నాడని ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ హయాం నుంచి సింగరేణి సంస్థ లాభాలు ఆర్జించినా ‘గోల్డెన్ షేక్ హ్యాండ్’ను అమలు చేసేందుకు కుట్రలు పన్నడం సరైంది కాదని చెప్తున్నారు.
గోల్డెన్ షేక్ హ్యాండ్ అవసరమా?
సాధారణంగా నష్టాల్లో ఉన్న సంస్థల్లో ఉద్యోగుల కోతలు, వీఆర్ఎస్ పథకాలు అమలు చేస్తారు. కానీ, సింగరేణి కొన్నేండ్లుగా వేల కోట్ల లాభాలు సాధిస్తున్నది. నిరుడు రూ. 2 వేల కోట్లకు పైగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్ల లాభాలు సాధించిన సింగరేణిలో గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్ అవసరమా? అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సంస్థ నిర్వహణ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకే ప్ర భుత్వం సూచించిన విధంగానే యాజమాన్యం కార్మికుల సంఖ్య ఎక్కువైందనే నెపంతో ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టడం సరికాదని చెప్తున్నారు.
వారసత్వ ఉద్యోగాలపై కార్మికుల ఆందోళన
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొనేందుకు వారసత్వ ఉద్యోగాలను ప్రవేశపెట్టారు. కొన్ని కార్మిక సంఘాలు కుట్రలు పన్నినా న్యాయ నిపుణుల సలహా మేరకు కారుణ్య నియామకాల పేరుతో మెడికల్ ఇన్ వాలిడేషన్ చేసి సుమారు 15 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలిచ్చారు. వీటితో ప్రత్యక్షంగా సింగరేణి కార్మిక కుటుంబాలు లాభపడగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి అవకాశాలు పొందారు. ప్రస్తుత కాం గ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క మెడికల్ బోర్డు కూడా నిర్వహించలేదని, మెడికల్ బో ర్డు నిర్వహించి ఇన్ వాలిడేట్ అయిన వారికి ఉద్యోగాలు కల్పించకపోవడం వల్ల డిపెండెంట్లు ఎదురుచూపులు చూస్తున్నారని కార్మికులు చెప్తున్నారు. ఇలాంటి తరుణంలో గోల్డెన్ హ్యాండ్ షేక్ లాంటి పథకాన్ని ప్రవేశపెట్టేందుకు యాజమాన్యం ఆలోచిస్తున్నదని, ఇదే జరిగితే భవిష్యత్తులో మెడికల్ బోర్డును కూడా ఎత్తేస్తారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రైవేటీకరణ దిశగా సింగరేణి?
సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నదని కార్మిక సంఘాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్‌పరం చేయడం, ప్రైవేట్ బొగ్గు బ్లాకులను సీఎం బావమరిదికి ఇప్పించేందుకు పథకాలు రచించగా బీఆర్ఎస్ అడ్డుకున్నది. ప్రస్తుతం గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్‌ను కూడా ప్రవేశపెట్టి దశలవారీగా సింగరేణి సంస్థను ప్రైవేట్‌పరం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని కార్మిక నేతలు మండిపడుతున్నారు.
సమ్మె హెచ్చరిక
‘గోల్డెన్ హ్యాండ్ షేక్’ పేరుతో కార్మికుల భవిష్యత్తుతో ఆడుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, గోల్డెన్ షేక్ హ్యాండ్ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే సమష్టి ఉద్యమానికి దిగుతామని హెచ్చరిస్తున్నాయి.
కార్మికులను తగ్గించేందుకే..
సింగరేణిలో కార్మికుల సంఖ్య ఎక్కువ ఉన్నదన్న సాకుతో గోల్డెన్ షేక్ హ్యాండ్ లాంటి స్కీమ్‌ను ప్రవేశపెట్టడం సరికాదు. ఉద్యోగ విరమణకు చేరువలో ఉన్న సీనియర్ కార్మికులు తమకు ఉద్యోగాలు చేసే ఓపిక లేక, మెడికల్ బోర్డుకు వెళ్లి డిపెండెంట్లకు ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూస్తుంటే దాన్ని కూడా నిర్వహించకుండా యాజమాన్యం నిలిపివేసింది. సంస్థలో కార్మికుల సంఖ్య ఎక్కువ ఉన్నదని బలవంతంగా కార్మికులందరిపై గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్‌ను రుద్దాలని ప్రయత్నిస్తే కచ్చితంగా అడ్డుకుంటాం. ఇలాంటి ఆలోచనమానుకోవాలి.
-మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
తిరుగుబాటు చేస్తం
సింగరేణిలో గోల్డెన్ షేక్ హ్యాండ్ను ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదనే కథనాలు వస్తున్నాయి. అలాంటి పథకాన్ని ప్రవేశపెడితే కార్మికులను ఏకం చేసి తిరుగుబాటు చేస్తం. కొన్నేండ్లుగా లాభాల బాటలో నడుస్తున్న సింగరేణిలో గోల్డెన్ షేక్ హ్యాండ్ను ఎలా ప్రవేశపెడుతరు? బొగ్గు ఉత్పాదనలో ఈ ఆర్థిక సంవత్సరం కూడా వేలాది కోట్ల లాభాలు సాధించామని గొప్పగా ప్రకటించిన సింగరేణి యాజమాన్యం ఏ కారణాలతో గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్‌ను ప్రవేశపెడుతుంది?. గోల్డెన్ స్కీమ్‌ను ప్రవేశపెడితే ఉద్యమం తప్పదు.
-రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు