సిడ్నీ: వందేండ్ల క్రితం ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్దాంతంలోని ‘గురుత్వాకర్షణ తరంగాల’కు చెందిన ఓ విస్తృత శ్రేణిని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. 35 తరంగాలతో కూడిన ఇంత విస్తారమైన శ్రేణిని గుర్తించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. 2019 నవంబర్ నుంచి 2020 మార్చి మధ్య ఇవి భూమిని తాకుతూ ప్రయాణించినట్టు తెలిపారు.
తాజా తరంగాలను పరిగణనలోకి తీసుకుంటే 2015 నుంచి ఇప్పటివరకూ 90 గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించినట్టు పేర్కొన్నారు. శ్రేణిలోని 32 తరంగాలు బ్లాక్‌హోల్స్ కలిసిపోవడం వల్ల ఏర్పడితే, మిగతా మూడు తరంగాలు న్యూట్రాన్ స్టార్, బ్లాక్‌హోల్ ఢీకొనడంతో ఉద్బవించవచ్చని అంచనా వేస్తున్నారు. విశ్వ రహస్యాలను తెలుసుకోవడానికి ఈ డాటా ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
విశ్వంలో కంటికి కనిపించని అలలనే గురుత్వాకర్షణ తరంగాలుగా పిలుస్తారు. ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ 1916లో తొలిసారిగా విశ్వంలో గురుత్వాకర్షణ తరంగాల ఉనికిని గుర్తించారు. గ్రహాలు, నక్షత్రాలు ఢీకొన్నప్పుడు ఇవి ఏర్పడుతాయని తెలిపారు. నిశ్చలంగా ఉన్న చెరువు నీటిలో ఏదైనా రాయిని వేయగానే.. ఎలాగైతే అలలు విస్తరిస్తాయో.. అచ్చం అలాగే గురుత్వాకర్షణ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రయాణాన్ని సాగిస్తాయన్నారు.