తిరుమల : తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి (Renigunta Airport ) శ్రీవేంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా ( Venkateswara International Airport ) పేరుగా మార్చాలని టీటీడీ( TTD ) పాలకవర్గం కేంద్ర విమానయానశాఖకు సిఫార్సు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు వెల్లడించారు. టీటీడీ ధర్మ కర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. తిరుమలకు ఐకానిక్‌గా విమానాశ్రయానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇటీవల కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసిన సందర్భంగా వారి అభ్యర్థన మేరకు బెంగుళూరులోని ప్రధాన ప్రాంతంలో శ్రీవారి ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇందుకు కావాల్సిన 47 ఎకరాల స్థలాన్ని కర్ణాటక ప్రభుత్వం కేటాయించగానే ఆలయం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమార స్వామి కేంద్ర ప్రభుత్వం నుంచి టీటీడీకి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించేందుకు ముందుకు రావడంతో త్వరలోనే బస్సులను తిరుమలకు తీసుకొస్తామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో ఏర్పాటు చేయనున్న సీఎస్ఐఆర్ ల్యాబ్‌కు లీజు పద్ధతిలో టీటీడీ స్థలాన్ని కేటాయించానున్నామని తెలిపారు. న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక టీటీడీ కళాశాలను ఆధునీకరించనున్నట్లు పేర్కొన్నారు. టీటీడీలోని లెక్చరర్ పోస్టుల భర్తీని నిలిపివేయాలని ఏపీపీఎస్సీకి సిఫార్సు చేయన్నుట్లు వివరించారు. ఇప్పటికే పని చేస్తున్న 200 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.