హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) దరఖాస్తుల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభమయ్యింది. ఆన్లైన్లో అభ్యర్థులు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో మూడున్నర గంటల పాటు జరిగే ఈ ప్రవేశ పరీక్షను జూలై చివరి వారంలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచే ప్రశ్నలడుగుతారు. ఈ పరీక్షలో సాధించే స్కోరును మన రాష్ట్రంలోని ఇప్లూ, హెచ్సీయూ, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ వర్సిటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకూ వినియోగిస్తారు.
పరీక్ష విధానం
సెక్షన్ 1A: 13 భాషలు, సెక్షన్ 1B: 19 భాషలు (వీటిల్లో ఏభాషనైనా ఎంచుకోవచ్చు, మొత్తం 50 ప్రశ్నలిస్తారు. విద్యార్థి 40 ప్రశ్నలను రాయాల్సి ఉంటుంది, ఇందుకు 45 నిమిషాల సమయమిస్తారు) దీంట్లో తెలుగు సహా ప్రాంతీయ భాషలన్నీ ఉంటాయి.
సెక్షన్ 2: 27 సబ్జెక్టులు (విద్యార్థి ఏవైనా 6 సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఆయా సబ్జెక్టులు అడ్మిషన్ పొందగోరే యూనివర్సిటీలో ఉండాలి. 50 ప్రశ్నల్లో 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 45 నిమిషాల సమయమిస్తారు. ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ లాంటి అంతర్జాతీయ భాషలు ఉంటాయి.
సెక్షన్ 3: జనరల్ టెస్ట్ (జీకే, కరంట్ అఫైర్స్, జనరల్, మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్ల నుంచి ఇచ్చే 75 ప్రశ్నల్లో 60 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఇందుకు 60 నిమిషాల సమయం ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 2-4-2022
సమర్పణకు తుది గడువు: 30-4-2022
సంప్రదించాల్సి వెబ్సైట్: http://cuet.samarth.ac.in
హెల్ప్లైన్లు: 011 40759000, 69227700, cuet-ug@nta.ac.in