
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): పోడు భూములపై ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 8 నుంచి ప్రారంభించాలని అధికారులను సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. పోడు సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎఫ్‌వో, అదనపు కలెక్టర్లు, డీపీవోలతో శుక్రవారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్ఆర్సీలతోపాటు జిల్లా, డివిజన్, మండలం, గ్రామ పంచాయతీ స్థాయి బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మొదట గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తులకు అవగాహన కల్పించి, వారి నుంచి దరఖాస్తుల (ఫారం-ఏ) స్వీకరణను ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. జిల్లాస్థాయిలో జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు.