Real Estate | అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో దేశంలోనే ఇతర అన్ని మెట్రో నగరాలకంటే హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం జెట్ స్పీడ్తో ఎదుగుతున్నది.. ఇది ఏడాదిన్నర క్రితం మాట. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విధానాలతో హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది.. ఇది నేటి మాట. దేశంలోని ఇతర మెట్రో నగరాలనే వెనక్కి నెట్టిన హైదరాబాద్ రియల్ రంగం, నేడు ఇతర నగరాల కంటే వెనుకబడి నేలచూపులు చూస్తున్నది. ఇదే విషయాన్ని ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ తన సర్వే ద్వారా రుజువు చేసింది. హైడ్రా చర్యలతోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 24(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సహా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏడాదిన్నర కాలం దాకా దేశంలోనే ఇతర మెట్రో నగరాలను వెనక్కినెట్టి రియల్ రంగంలో దూసుకుపోయిన హైదరాబాద్ మార్కెట్ ఇప్పుడు వేగంగా పడిపోతున్నది. రాష్ట్రం ఆవిర్భావం అనంతరం అభివృద్ధి చెందుతూ రాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తీవ్ర నష్టాలను చవిచూస్తున్నది. గడిచిన ఏడాదిన్నర కాలంగా నగరంలో జరిగిన క్రయవిక్రయాలు, లీజు లావాదేవీలను పరిగణనలోకి తీసుకుని తాజాగా ప్రాప్ఈక్విటీ సంస్థ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోని వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకొస్తూ పలు అంశాలతో నివేదికను విడుదల చేసింది.
లోక్సభ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతూ వచ్చింది. ఇప్పుడు మరింత ఊబిలోకి కూరుకుపోయింది. కొన్ని నెలల కిందట వచ్చిన సర్వేల్లో గరిష్ఠంగా మునుపటితో పోలిస్తే 22% క్రయ, విక్రయాలు తగ్గినట్టుగా తేలింది. కానీ తాజా సర్వేలో ఏకంగా 47% అమ్మకాలు పడిపోవడం గమనార్హం. నిరుడు తొలి త్రైమాసికంలో 20,835 యూనిట్లను విక్రయించగా, ఈ ఏడాదిలో అమ్మకాలు 11,114 యూనిట్లకు పడిపోయినట్టు తేలింది. పడిపోయిన యూనిట్ల విలువ కనీసం రూ. 6 వేల కోట్ల నుంచి రూ.7వేల కోట్ల మేర ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఏటా వచ్చే ఆదాయాన్ని చూస్తే నిరుడి కంటే దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా తగ్గడం ఈ సర్వేకు అద్దం పట్టేలా ఉన్నది. ఇతర మెట్రో నగరాల్లో ము నుపటితో పోలిస్తే అమ్మకాలు తగ్గినా, హైదరాబాద్లో పెరిగిన దాఖలాలు ఉన్నాయి. రియల్ ఢమాల్లో హైదరాబాద్ తర్వాత ముంబై, కోల్కతా, థానే ఉన్నప్పటికీ హైదరాబాద్ మార్కెట్కు సారూప్యత ఉండే బెంగళూరు, చెన్నైలో సానుకూల అమ్మకాలు నమోదైనట్టు నివేదికలో వెల్లడయ్యాయి.
హైడ్రా పుణ్యమా అని హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ కుదేలైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. హైడ్రాతో నగర ప్రజలతోపాటు బిల్డర్లూ తీవ్రనష్టాలపాలై ఏకంగా తనువులే చాలిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అసెంబ్లీలో సోమవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, కమ్యూనికేషన్స్ తదితర శాఖల బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. హెచ్ఎండీఏ ఆదాయం ఏటా రూ.120 నుంచి రూ.200 కోట్లు వరకు ఉండేదని, ఈ ఏడాదిలో రూ.50 కోట్ల కంటే తక్కువగా పడిపోయిందని తెలిపారు.
హైడ్రాతో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తంచేశారు. అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది.. మార్కెట్ దెబ్బతిన్నది. దీనికి కారణమైన హైడ్రాకు.. మూసీ కూల్చివేతలకు కృతజ్ఞతలు’ అంటూ వ్యంగ్యాస్ర్తాలను సంధించారు.