ధర్మశాల: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరో టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్మురేపుతూ ఐపీఎల్ 19వ సీజన్లో అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్ బెర్తు సొంతం చేసుకుంది. వెంకటేశ్ అయ్యర్ (40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 నాటౌట్)కు తోడు కింగ్ కోహ్లీ (37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 58) అర్ధ శతకంతో సత్తా చాటడంతో ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. 9 విజయాలు 18 పాయింట్లతో బెంగళూరు అగ్రస్థానంలోకి రాగా.. సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన పంజాబ్‌కు ఇది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం. దాంతో తమ చివరి మ్యాచ్‌లో గెలిచినా ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు గ్యారంటీ లేకుండా పోయింది.
హైస్కోరింగ్ పోరులో తొలుత ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు చేసింది. దేవదత్ పడిక్కల్ (25 బంతుల్లో 45), టిమ్ డేవిడ్ (12 బంతుల్లో 28) కూడా రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులకే పరిమితమైంది. శశాంక్ సింగ్ (27 బంతుల్లో 56) ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఆర్సీబీ రసిఖ్ సలామ్ (3/36), భువనేశ్వర్ (2/38) రాణించారు. వెంకటేశ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఆర్సీబీ పేస్ ఎటాక్ ధాటికి టాపార్డర్ కుదేలైంది. . వెటరన్ పేసర్ భువనేశ్వర్ ఇన్నింగ్స్ మూడో బంతికే ప్రియాంశ్ ఆర్య (0)ను డకౌట్ చేసి పంజాబ్‌ను దెబ్బతీశాడు. మూడో ఓవర్లో పడిక్కల్ పట్టిన క్యాచ్‌తో మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ (2)ను వెనక్కిపంపగా.. రెండు బంతుల తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (1) రసిఖ్ సలామ్ ఔట్ స్వింగర్‌ను వెంటాడి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో కింగ్స్ 19/3తో ఎదురీత మొదలు పెట్టింది. కూపర్ కనోలి (37), సూర్యాంశ్ షెడ్గే (35) క్రమం తప్పకుండా ఫోర్లు, సిక్సర్లు కొడుతూ ప్రతిఘటించారు. కానీ, ఆర్సీబీ క్రమశిక్షణతో కూడిన బౌలింగ్, పదునైన ఫీల్డింగ్‌తో అడ్డుకుంది.
కూపర్‌ను 8వ ఓవర్లో షెఫర్డ్ పెవిలియన్ చేర్చగా.. స్పిన్నర్ సుయాశ్ వేసిన 11వ ఓవర్లో షెడ్గే.. లాంగాఫ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి పంజాబ్ స్కోరు 93/5. ఈ దశలో సుయాశ్ తర్వాతి ఓవర్లో శశాంక్ సింగ్ మూడు సిక్సర్లతో చెలరేగి ఆశలు రేపాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన స్టోయినిస్ (37) వేగంగా ఆడి సహకరించాడు. కానీ, 17వ ఓవర్లో జోష్ హేజిల్‌వుడ్ అతన్ని ఎల్బీ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీసి ఆర్సీబీ గెలుపు ఖాయం చేశాడు. ఆఖరి ఓవర్లో 33 పరుగులు కావాల్సిన దశలో శశాంక్, అజ్మతుల్లా (14) ఔటవడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.
తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ మూడో ఓవర్లోనే ఓపెనర్ జాకబ్ బెథెల్ (11) వికెట్ కోల్పోయినా.. కోహ్లీ, పడిక్కల్ రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యంతో బలమైన పునాది వేశారు. అజ్మతుల్లా బౌలింగ్‌లో ఎక్స్ట్రా కవర్ మీదుగా చక్కటి సిక్స్ కొట్టిన విరాట్ తన క్లాస్ షాట్లతో అలరించాడు. ఎదుర్కొన్న తొలి బంతినే స్టాండ్స్‌కు పంపిన పడిక్కల్ పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ ఇద్దరి జోరుకు పవర్ ప్లేలో ఆర్సీబీ 61/1 స్కోరు చేసింది. ఏడో ఓవర్లో స్పిన్నర్ చహల్‌కు పడిక్కల్ రెండు సిక్సర్లతో స్వాగతం పలికాడు. జోరు మీద కనిపించిన అతడిని పదో ఓవర్లో హర్‌ప్రీత్ ఔట్ చేసినా పంజాబ్‌కు ఆనందం ఎంతోసేపు నిలవలేదు.
నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చిన వెంకటేశ్ దూకుడు బ్యాటింగ్ చేశాడు. బ్రార్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, చహల్ ఓవర్లో రెండు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 31 బంతుల్లో ఐపీఎల్లో తన 67వ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న విరాట్.. చహల్ బౌలింగ్‌లో ఆర్యకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయినా. వెంకీ ధాటిని కొనసాగిస్తూ పంజాబ్ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టాడు. లోకీ ఫెర్గూసన్ వేసిన 17వ ఓవర్లో లాంగాఫ్, లాంగాన్ మీదుగా భారీ సిక్సర్లు బాదాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ కూడా బౌండరీలతో విరుచుకుపడటంతో ఆర్సీబీ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.
9 ఐపీఎల్లో విరాట్ కోహ్లీ 500 ప్లస్ రన్స్ చేయడం ఇది తొమ్మిదోసారి. డేవిడ్ వార్నర్ 7సార్లు ఈ ఘనత సాధించి రెండో స్థానంలో ఉన్నాడు.
44 ఆర్సీబీ 200 ప్లస్ స్కోరు చేయడం ఇది 44వ సారి. టీ20ల్లో అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన రెండో జట్టు ఇది. భారత్ (50 సారు) ముందుంది.
46 టీ20ల్లో అత్యధికంగా 46 సార్లు 200 పైచిలుకు స్కోర్లు ఇచ్చిన జట్టుగా పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీ (40 సార్లు) రెండో స్థానంలో ఉంది. శ్రేయస్ అయ్యర్ అత్యధికంగా 31సార్లు తన ప్రత్యర్థులకు 200 ప్లస్ స్కోర్లు ఇచ్చిన కెప్టెన్‌గా నిలిచాడు.
బెంగళూరు: 20 ఓవర్లలో 222/4 (వెంకటేశ్ 73*, కోహ్లీ 57, హర్‌ప్రీత్ 2/35)
పంజాబ్: 20 ఓవర్లలో 199/8 (శశాంక్ 56, స్టోయినిస్ 37, రసిఖ్ 3/36, భువీ 2/38)