ముంబై, జనవరి 6: భాగస్వాములకు బ్యాంకులు డివిడెండ్లుగా ఇచ్చే చెల్లింపులు.. ఆ బ్యాంక్ నికర లాభంలో 75 శాతాన్ని మించరాదంటూ రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదిత నిబంధనల్ని విడుదల చేసింది. ఈక్విటీ షేర్లపై చెల్లించే మొత్తాన్నే ‘డివిడెండ్’గా నిర్వచించిన ఆర్బీఐ.. అందులో మధ్యంతర డివిడెండ్ కూడా కలిసే ఉంటుందని స్పష్టం చేసింది. అయితే పర్పెచ్చువల్ నాన్-క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్‌పై డివిడెండ్ వేరే అని పేర్కొన్నది.
ఈ మేరకు ఆర్బీఐ డైరెక్షన్స్-2026 డ్రాఫ్ట్‌ను జారీ చేసింది. అర్హత కలిగిన గరిష్ఠ డివిడెండ్ చెల్లింపు కోసమే ఈ కొత్త పద్ధతిని ఆర్బీఐ ప్రతిపాదించింది. కాగా, దీని ప్రకారం డివిడెండ్ల ప్రకటన కోసం ప్రతిపాదనను పరిశీలించేటప్పుడు బ్యాంకు ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు.. సంస్థ దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళికలు, మూలధన నిల్వలను తప్పక దృష్టిలో ఉంచుకోవాలి.