డెహ్రాడూన్, డిసెంబర్ 22: ఓ వైపు పార్టీ నుంచి వలసలు మరోవైపు సీనియర్ల అసమ్మతితో ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌పై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ రాజకీయ బాంబు వేశారు. పార్టీలోని ఒక సెక్షన్ నేతలను ఉద్దేశిస్తూ ఆయన బుధవారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరాఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఉన్న రావత్.. పార్టీ తనకు మద్దతివ్వడం లేదని, ఎన్నికల ప్రచారానికి సహకరించడం లేదని అన్నారు.
‘ఎన్నికల సముద్రాన్ని ఈదుతున్న నాకు సహకరించాల్సింది పోయి.. సంస్థ (పార్టీ అధిష్టానాన్ని ఉద్దేశించి) ప్రతికూల పాత్ర పోషిస్తున్నది’ అని అన్నారు. ‘అధికారంతో కొంతమంది ఈ సముద్రంలో మొసళ్లను వదిలారు. వారి నామినీలు నా కాళ్లు, చేతులు కట్టేయాలని చూస్తున్నారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇక చాలు అని అనిపిస్తున్నది. కొంత విశ్రాంతి తీసుకుందామని అనిపిస్తున్నది’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు.