Ravi Kishan | బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు రవి కిషన్ శుక్లాకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చాయి. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ప్రసంగాలపై ఆగ్రహంతో ఒక వ్యక్తి ఈ బెదిరింపులు చేసినట్లు సమాచారం. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. రవి కిషన్ వ్యక్తిగత కార్యదర్శి శివమ్ ద్వివేది గోరఖ్‌పూర్‌లోని రామ్‌ఘర్ తాల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సెక్షన్ 302 (హత్య), 351(3), 352 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, నిందితుడు రవి కిషన్‌పై మాత్రమే కాకుండా ఆయన కుటుంబసభ్యులపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అలాగే మత విశ్వాసాలపై అభ్యంతరకర పదాలు ఉపయోగించాడు. ఈ ఘటనపై రవి కిషన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నా తల్లిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారు. శ్రీరాముడి గురించి కూడా అవమానకర పదాలు వాడారు. ఇది నా వ్యక్తిగత గౌరవంపైనే కాదు, మన ధర్మం, భారతీయ సంస్కృతిపై దాడి. కానీ నేను భయపడను. జాతీయవాదం, ధర్మ మార్గంలో నిలబడతాను,” అని రవి కిషన్ ట్వీట్ చేశారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. బిహార్‌లోని అరా జిల్లాకు చెందిన అజయ్ కుమార్‌గా గుర్తించినట్లు సమాచారం. ఎంపీ సిబ్బంది రవి కిషన్‌కు అదనపు భద్రత కల్పించాలని పోలీసులను అభ్యర్థించారు. ప్రస్తుతం గోరఖ్‌పూర్ పోలీసులు నిందితుడి ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేస్తూ దర్యాప్తు వేగవంతం చేశారు. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ఆదరణ పొందిన రవి కిషన్‌పై వచ్చిన ఈ బెదిరింపు కేసు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. రవి కిషన్ ధైర్యంగా స్పందిస్తూ..“న్యాయం జరుగుతుంది, ధర్మం గెలుస్తుంది” అంటూ తన మనోధైర్యాన్ని మరోసారి ప్రదర్శించారు. కాగా రవి కిషన్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం.