Ravi Bishnoi | కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐర్లాండ్‌తో 0-2తో ఘోరంగా సిరీస్‌ను కోల్పోవడంతో సహా భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో ఓడిపోయింది. యూకే( England) పర్యటనలో ఉన్న టీమిండియా ఇంకా ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ క్రమంలో మంగళవారం (జూలై 7, 2026) ఇంగ్లాండ్‌తో జరిగే మూడో టీ20లో(T20) కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. మూడో టీ20 మ్యాచ్‌లో స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై(Ravi Bishnoi )వేటు పడే అవకాశం ఉంది.
రెండో టీ20లో ఏకంగా 60 పరుగులు సమర్పించుకోవడంతో పాటు, ఒకే ఇన్నింగ్స్‌లో 3 నో-బాల్స్ వేసి చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. దీంతో అతని స్థానంలో జట్టు యాజమాన్యం అదనపు పేసర్‌ను ఆడించాలని భావిస్తోంది అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఇప్పటికే జట్టులో ఉండగా ఓల్డ్ ట్రాఫోర్డ్‌లోని పరిస్థితులకు మూడో స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరమా అనే దానిపై చాలా ప్రశ్నలు తలెత్తాయి. మూడో స్పిన్నర్‌కు బదులుగా తుది తుది జట్టులోకి ఒక పేస్ బౌలర్ వస్తాడని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో నిలకడగా రాణిస్తున్న ప్రిన్స్ యాదవ్‌ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా, బిష్ణోయ్ తన 4 ఓవర్ల కోటాలో వికెట్లేమీ తీయకుండా 60 పరుగులు ఇచ్చాడు. ఇంగ్లండ్ విజయానికి చివరి 4 ఓవర్లలో 49 పరుగులు అవసరమైన సమయంలో (17వ ఓవర్) అతను రెండు నో-బాల్స్ వేయడం భారత్ కొంపముంచింది. ఆ ఫ్రీ హిట్లను జాకబ్ బెథెల్ సిక్సర్లుగా మలచడంతో ఆ ఒక్క ఓవర్ నుంచే ఏకంగా 29 పరుగులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్లిపోయింది.