హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతుల వడ్లు కొనని కేంద్రంపై టీఆర్ఎస్ చేపట్టిన నిరసనల్లో భాగంగా బుధవారం జాతీయ రహదారులపై రాస్తారోకో కార్యక్రమానికి గులాబీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. నాగపూర్, ముంబై, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై నిరసన తెలుపాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బుధవారం ఆయా జాతీయ రహదారులు వెళ్లే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని, రాష్ట్ర రైతాంగం పక్షాన టీఆర్ఎస్ ధర్మాగ్రహాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సూర్యాపేట జిల్లాలో జగదీశ్‌రెడ్డి, జనగామ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిర్మల్ జిల్లా కడ్తాల్ జంక్షన్ వద్ద ఇంద్రకరణ్‌రెడ్డి పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, రైతుబంధు సమితి బాధ్యులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. జనగామలో తలపెట్టిన నిరసన దీక్ష స్థలాన్ని మంగళవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు.
రాస్తారోకోను విజయవంతం చేయండి: పల్లా రాజేశ్వర్‌రెడ్డి
రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ బుధవారం టీఆర్ఎస్ తలపెట్టిన జాతీయ రహదారులపై రాస్తారోకోను విజయవంతంచేయాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. నాగపూర్ జాతీయ రహదారిపై కడ్తాల్, ఆదిలాబాద్ వద్ద, బెంగుళూర్ జాతీయ రహదారి భూత్పూర్వద్ద , విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ, సూర్యాపేట, నరిరేకల్, టుప్పల్ వద్ద , ముంబయ్ జాతీయ రహదారి సంగారెడ్డి వద్ద రస్తారోకో నిర్వహించునున్నామని వెల్లడించారు.
నాగపూర్ జాతీయ రహదారి కడ్తాల్ (ఆదిలాబాద్)
బెంగుళూర్ జాతీయ రహదారి భూత్పూర్
విజయవాడ జాతీయ రహదారి కోదాడ సూర్యాపేట, నరిరేకల్, చౌటుప్పల్
ముంబయ్ జాతీయ రహదారి సంగారెడ్డి