‘ఈ కథ విన్నప్పుడు నాకు యునిక్‌గా అనిపించింది. ఇప్పటివరకూ పెళ్లిచూపులు, గీతగోవిందం, అర్జున్‌రెడ్డి వంటి యూత్ సినిమాలే విజయ్ చేశారు. మాస్ బ్లెడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ఆయన చేయలేదు. ఈ సినిమాలో ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్లో విజయ్ కనిపించబోతున్నాడు. 80ల్లో జరిగే కథ ఇది. నాటి ప్రపంచాన్ని టెక్నీషియన్స్ అంతా కలిసి అద్భుతంగా తీర్చిదిద్దారు. కష్టపడి పాషన్‌తో చేస్తున్న సినిమా ఇది. అందుకు ఈ గ్లింప్సే సాక్ష్యం. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో అందర్నీ తనవైపు తిప్పుకున్న రవికిరణ్ కోలా ఈ రెండో సినిమాను కూడా అద్భుతంగా తీస్తారని మా నమ్మకం’ అని నిర్మాత దిల్ రాజు అన్నారు. అగ్ర హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ చేస్తున్న పానిండియా రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్థన’. రవికిరణ్ కోలా దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణదశలో ఉంది.
ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ని సోమవారం హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడారు. ఇంకా దర్శకుడు రవికిరణ్ కోలా, డీవోపీ ఆనంద్ సి.చంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్ డినో శంకర్ కూడా మాట్లాడారు. ఇక గ్లింప్స్ విషయానికొస్తే.. ‘బండెడన్నం తిని కుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడైనా విన్నావా?.. నేను చూశాను.. కొమ్ముల్తో వాడి కథను వాడే రాసుకున్నోడు.. కన్నీళ్లను ఒంటికి నెత్తురులా పూసుకున్నోడు.. చావు కళ్లముందుకొచ్చి నిలబడితే.. కత్తి అయి లేచి కలబడినోడు.. కనపడ్డాడు.. నా లోపల..’ అనే విజయ్ దేవరకొండ చెప్పే పవర్ఫుల్ డైలాగ్‌తో గ్లింప్స్ మొదలైంది. గ్లింప్స్ ఆద్యంతం యాక్షన్ అంశాలతో సాగింది. విజయ్ కూడా మునుపెన్నడూ చూడని మాస్ అవతారంలో కనిపించారు.