షాబాద్, మార్చి 15: బాల్య వివాహాలను అరికట్టడానికి అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ సంఘంపై జిల్లా స్థాయి కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చైల్డ్ లేబర్, బాల్య వివాహాలు అరికట్టడానికి అందరూ కృషి చేయాలని, బాల్య వివాహాలు ఎక్కడ కూడా జరుగకుండా చూడాలని చెప్పారు. జిల్లాలో అనాథలు ఉంటే వారిని గుర్తించి ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో బాల్య వివాహాల నిరోధక చట్టం, వివాహ నమోదు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో జరిగే బాల్య వివాహాలను గుర్తించి ప్రథమ స్థాయిలోనే వివాహాలను ఆపేలా చర్యలు తీసుకోవాలని, పంచాయతీ కార్యదర్శులు వివాహ నమోదు అధికారిగా ఉంటారన్నారు. గ్రామాల్లో వివాహాలకు ముందుగానే పంచాయతీ కార్యదర్శులతో అనుమతి తీసుకొని, వివాహం నమోదు చేసుకుంటే వయస్సు నిర్ధ్దారణతో బాల్య వివాహాలను అరికట్టవచ్చని తెలిపారు. సమావేశంలో జిల్లా లీగల్ సెల్ సెక్రటరీ శ్రీదేవి, జిల్లా సంక్షేమాధికారి మోతి, లీడ్‌బ్యాంక్ మేనేజర్ రిజ్వి, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, సైబరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిశోర్‌కుమార్, డీఆర్డీవో అదనపు పీడీ నీరజ, సీడీపీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.