రంగారెడ్డి, మార్చి 21, (నమస్తే తెలంగాణ): త్వరలోనే 57ఏండ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు అందనున్నది. ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ కనీస వయస్సు అర్హతను 65 ఏండ్ల నుంచి 57కు తగ్గిస్తూ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓటరు జాబితా ఆధారంగా 57 ఏండ్లు నిండిన వారి వివరాలను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అర్హులను గుర్తించారు. గతేడాది ఆగస్టు నుంచి వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియ ముగిసిన దృష్ట్యా ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్ వచ్చిన వెంటనే వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ గుర్తించిన వారికి సంబంధించి మృతిచెందినవారు, ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారు, కుటుంబంలో మరొకరికి ఆసరా పింఛన్ పొందుతున్నారా లేదనే వివరాలను మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు, గ్రామీణ ప్రాంతంలో పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి విచారణ చేపట్టనున్నారు. 57 ఏండ్లు నిండిన వారికి సంబంధించి లెక్కతేల్చనున్నారు. మరోవైపు ఇతర ఆసరా పింఛన్లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి 20వేల కొత్త పింఛన్లకు అనుమతులురాగా, ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే అర్హులైన వారికి కొత్త పింఛన్లను అందజేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 1,59,570 ఆసరా పింఛన్లుండగా నెలకు రూ.38 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తుంది.
57ఏండ్లు నిండిన వారు 46,847 మంది..
జిల్లాలో 57ఏండ్లు నిండిన వారు 46,847 మంది అర్హులున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు లెక్కతేల్చారు. ఓటరు జాబితాతోపాటు దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి 57ఏండ్లు నిండిన వారిని గుర్తించారు. వీరికి ఒకట్రెండు నెలల్లో కొత్త పింఛన్లను అందజేసేందుకుగాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 2361, ఆమనగల్లులో 826, బాలాపూర్‌లో 3923, చేవెళ్లలో 1486, ఫరూఖ్‌నగర్‌లో 1990, గండిపేటలో 1154, హయత్‌నగర్‌లో 2241, ఇబ్రహీంపట్నంలో 1608, జిల్లెడ్ చౌదరిగూడెంలో 901, కడ్తాల్‌లో 714, కందుకూరులో 1759, కేశంపేట్‌లో 1042, కొందుర్గులో 691, కొత్తూరులో 703, మాడ్గులలో 1343, మహేశ్వరంలో 1253, మంచాలలో 1399, మొయినాబాద్‌లో 1164, నందిగామలో 924, రాజేంద్రనగర్‌లో 4310, సరూర్‌నగర్‌లో 5557, శేరిలింగంపల్లిలో 3369, షాబాద్‌లో 657, శంషాబాద్‌లో 1516, శంకర్‌పల్లిలో 1568, తలకొండపల్లిలో 1077, యాచారంలో 1311 దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
పింఛన్ల కోసం నెలకు రూ.38కోట్లు..
ప్రభుత్వం పింఛన్ల నిమిత్తం ప్రతినెలా రూ.38కోట్ల మేర వెచ్చిస్తున్నది. త్వరలో మంజూరుకానున్న కొత్త పింఛన్లకు అదనంగా మరో రూ.8కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు రూ.1500, వితంతువులు, వృద్ధులు, బీడీ కార్మికులు తదితరులకు రూ.1000లకు పెంచడంతోపాటు తదనంతరం దివ్యాంగుల పింఛన్‌ను రూ.2016, ఇతర పింఛన్లను రూ.3016లకు ప్రభుత్వం పెంచింది. అదేవిధంగా జిల్లాలో ఆసరా పింఛన్లు మొత్తం 1,59,570 ఉండగా, వీరిలో వృద్ధాప్య పింఛన్లు 50,213, వితంతువులు 75056, దివ్యాంగులు 25,639, గీతాకార్మికులు 1960, చేనేత కార్మికులు 748, ఒంటరి మహిళలు 5911, పైలేరియా 43 మంది పింఛన్‌దారులున్నారు.