పరిగి, మార్చి 20: ఉపాధి హామీలో వంద రోజులు పని పూర్తి చేసుకున్న కుటుంబాల్లోని వారికి ప్రభుత్వం ఉన్నతి పథకం ద్వారా ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు వికారాబాద్ జిల్లాలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల పనిని పూర్తి చేసిన కుటుంబాలు 6,203 ఉన్నట్లు అధికారులు లెక్కతేల్చారు. వారిలో 18 నుంచి 45 ఏండ్లలోపు వారు 13,132 మంది అర్హులుగా ఉన్నట్లు గుర్తించారు. వారికి విద్యార్హత, నేర్చుకొనే అంశాలపై గల ఆసక్తి ఆధారంగా శిక్షణ ఇవ్వనున్నారు. 19వ తేదీ నుంచి శిక్షణను అధికారులు ప్రారంభించారు. శిక్షణ పొందే వారికి ప్రభుత్వమే ఉచితంగా వసతి, భోజన సదుపాయం కల్పించడంతోపాటు హాజరైనన్నీ రోజు లు ప్రతిరోజూ కూలీ రూ.237 చొప్పున ప్రభుత్వం అందజేయనున్నది. తద్వారా వారికి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా చర్యలు తీసుకున్నది.
నాలుగు సంస్థల ద్వారా ఉచిత శిక్షణ
2018-19లో 100 రోజులు ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న కుటుంబాల్లోని విద్యావంతులైన యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం నాలుగు సంస్థల ద్వారా ఉచిత శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. స్వ యం ఉపాధి శిక్షణా కార్యక్రమం(ఆర్ఎస్ఈటీఐ), ఇంగ్లిష్ వర్క్స్ రెడీనెస్ అండ్ కంప్యూటర్ సెంటర్(ఈడబ్ల్ల్యూఆర్సీ, డీఆర్డీఏ), నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్(ఎన్ఏసీ), వ్యవసాయ పరిజ్ఞాన పెంపు శిక్షణ(కేవీకే)ల ద్వారా నిరుద్యోగ యువతీయువకులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణా కాలంలో వారికి ప్రతిరోజూ రూ.237 చొప్పున అందజేయనున్నారు. ఆర్ఎస్ఈటీఐ, చిలుకూరులో అగర్బత్తీల తయా రీ, పేపర్కవర్లు, క్యాండిల్స్ తయారీ, మసాలా పౌడర్ తయా రీ, కస్టమ్స్ జువెలరీ, జ్యూట్ బ్యాగుల తయారీ, వెదురు బుట్టల సామగ్రి తయారీ, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్స్, ఫొటోగ్రఫీ, సెల్‌ఫోన్ మరమ్మతులు, టూ వీలర్ రిపేరింగ్, టీవీ టెక్నీషియన్, కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్వర్క్ సర్వీసెస్, యూపీఎస్ బ్యాటరీ రిపేర్, మోటర్ వైండిం గ్, హౌస్వైరింగ్, డెయిరీ ఫామింగ్, వర్మీకంపోస్ట్, పుట్ట గొడుగుల పెంపకం, గొర్రెలు, మేకలు, కోళ్ల సంరక్షణపై శిక్షణ, కూరగాయల పెంపకంపై 18 నుంచి 45 ఏండ్లలోపు మహిళలు ఎనిమిదో తరగతి చదువుకున్న వారికి పది రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈడబ్ల్యూఆర్‌సీ, డీఆర్డీఏ వికారాబాద్ ఆధ్వర్యంలో ఇంగ్ల్లిష్ వర్క్ రెడీనెస్ అండ్ కంప్యూటర్స్, లైవ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, రిటైల్, మార్కెటింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్పై శిక్షణ 18 నుంచి 26 ఏండ్లలోపు ఉన్న బాలికలకు 90 రోజులపాటు ఇవ్వనున్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ద్వారా డ్రైవాల్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, కన్స్ట్రక్షన్స్ సూపర్వైజర్స్, పెయింటింగ్, ప్లంబింగ్ అండ్ శానిటేషన్, స్టోర్ కీపర్స్, వెల్డింగ్, ల్యాండ్ సర్వేయర్, జూనియర్ మెకానిక్ హైడ్రాలిక్ శిక్షణను 45 ఏండ్లలోపు ఉన్న వారం దరికీ 90 రోజులపాటు ఇవ్వనున్నారు. కేవీకే ఆధ్వర్యంలో నర్సరీ వర్కర్లు, ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్, వర్మీ కంపోస్టు తయారీపై 21 నుంచి 45 ఏండ్లలోపు ఉన్న వారికి 15 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు.
ఏపీవోలకు ఎంపిక బాధ్యత
ఉపాధి హామీ పనుల్లో వంద రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాల్లోని విద్యావంతులైన యువతీయువకులను స్వయం ఉపాధి శిక్షణకు ఎంపిక చేసే బాధ్యతను ప్రభుత్వం ఏపీవోల కు అప్పగించింది. వీరు జిల్లాలోని అర్హులైన 13,132 మం దిని వారి విద్యార్థత, ఆసక్తి ఆధారంగా ఈ శిక్షణకు ఎంపిక చేస్తారు. ఉచిత శిక్షణ, వసతి సదుపాయాన్ని కల్పిస్తున్నా నిరుద్యోగ యువత ముందుకు రాకపోవడంతో ఆయా మండలాల్లోని అర్హులైన వారందరినీ వ్యక్తిగతంగా కలిసి శిక్షణకు వచ్చే లా ఏపీవోలు చర్యలు తీసుకోవాలని జిల్లాస్థాయి అధికారులు సూచించారు. ప్రతి మండలంలోని పలు గ్రామాల నుంచి కనీసం పది మందికి తక్కువ కాకుండా ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఏపీవోలను ఆదేశించారు. దీంతోపాటు మగ్గం వర్క్‌కు సంబంధించి ఒకే మండలంలో 30 మంది మహిళలు దరఖాస్తు చేసుకుంటే వారికి సంబంధిత మండల కేంద్రంలోనే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 15 మంది శిక్షణకు దరఖాస్తు చేసుకోగా.. మిగతా వారికి అవగాహన కల్పించి శిక్షణకు హాజరయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి
2018-19లో 100 రోజులు ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న కుటుంబాల్లోని విద్యావంతులైన యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి చూపేందుకు ప్రభుత్వం ‘ఉన్నతి’ పథకాన్ని రూపొందించింది. వికారాబాద్ జిల్లాలో ఈ పథకంలో ఉచిత శిక్షణకు అర్హులుగా 13,132 మందిని గుర్తించాం. వారు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ పొందొచ్చు. వారికి ఉచితంగా భోజనంతోపాటు వసతి, శిక్షణకు హాజరైనన్నీ రోజుల పాటు రూ.237 చొప్పున అందిస్తాం. విద్యావంతులైన యువతీయువకులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.
– కృష్ణన్, డీఆర్డీవో వికారాబాద్ జిల్లా