చేవెళ్ల రూరల్, నవంబర్ 17 : ఏండ్ల నాటి సమస్యలు సైతం ‘శుభోదయం’లో పరిష్కారమవుతున్నాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శుభోదయం కార్యక్రమంలో భాగంగా బుధవారం చేవెళ్ల మండల పరిధిలోని పల్గుట్ట, కందవాడ (నారాయణ్దాస్గూడ అనుబంధ గ్రామం) గ్రామాల్లో ఎమ్మెల్యే వీధులను కలియ తిరుగుతూ స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని, వాటితో అభివృద్ధి చేసుకుందామని వివరించారు. తాగు నీటి సమస్య, సీసీ రోడ్లు, విద్యుత్ సరఫరా తదితర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజలు ఇబ్బందులు పడకుండా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే కాలె యాదయ్య మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గ్రామాలకు నిధులు కేటాయించి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివ ప్రసాద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, పల్గుట్ట సర్పంచ్ జనార్దన్‌రెడ్డి, కందవాడ (నారాయణ్దాస్గూడ అనుబంధ గ్రామం సర్పంచ్ అరుంధతి, కందవాడ ఎంపీటీసీ రవీందర్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శివారెడ్డి, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.