సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారంలో మొక్కలు నాటేందుకు వికారాబాద్ జిల్లాలోని నర్సరీల్లో 96.12లక్షల మొక్కల పెంపకానికి పనులు ప్రారంభమయ్యాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలోని నర్సరీల్లో ఇప్పటికే మొక్కల పెంపకం కొనసాగుతున్నది. కాగా, పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కల పెంపకానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నెలాఖరుకు ప్లాస్టిక్ కవర్లలో విత్తనాలు వేసి పెంపకం పనులు చేపట్టడానికి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
-పరిగి, నవంబర్ 17
నర్సరీల్లో హరితహారం మొక్కల పెంపకానికి వికారాబాద్ జిల్లా అధికారులు ఏర్పాట్లు మ్ముమ్మరం చేశారు. జిల్లాలో వచ్చే ఏడాది కోసం మొత్తం 96.12 లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకనుగుణంగా నర్సరీల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో ఇప్పటికే మొక్కల పెంపకం కొనసాగుతుండగా గ్రామపంచాయతీల్లో వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు ప్లాస్టిక్ కవర్లలో విత్తనాలు వేసి పెంపకం చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మొక్కల పెంపకానికి రూ.7.68కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు.
566 పంచాయతీలు, 4 మున్సిపాలిటీలు
వికారాబాద్ జిల్లా పరిధిలో 566 పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలున్నాయి. వాటితో పాటు అటవీ శాఖకు సంబంధించిన నర్సరీలు కలిపి మొత్తం 599 నర్సరీల్లో మొక్కల పెంపకం చేపడుతున్నారు. ప్రణాళికాబద్ధంగా మొక్కల పెంపకానికి అధికారులు చర్యలు చేపట్టడంతో వచ్చే ఏడాది హరితహారంలో మొక్కలు నాటేందుకు అందుబాటులోకి తీసుకురావాలన్నది అధికారుల లక్ష్యం.
84.90లక్షల మొక్కలు పెంపకం..
వికారాబాద్ జిల్లా పరిధిలోని 566 పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో ఈ ఏడాది 84.90లక్షల మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రతి పంచాయతీ పరిధిలోని నర్సరీలో సుమారు 15వేల మొక్కల పెంపకానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నర్సరీలో అదనంగా 10 శాతం మొక్కలు పెంపకానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తద్వారా జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లోని నర్సరీల్లో మొత్తం 97లక్షల మొక్కలు పెంచడానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో కొన్ని పాలిథిన్ కవర్లు చిరిగిపోవడం, ఇతర కారణాలతో 10శాతం మొక్కలు తగ్గిపోయినా జిల్లాలోని పంచాయతీ నర్సరీల్లో 84.90లక్షల మొక్కలు హరితహారానికి అందుబాటులో ఉంటాయి.
చురుగ్గా మట్టి పనులు..
ప్రస్తుతం అన్ని పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కల పెంపకానికి అవసరమైన ఎర్ర, నల్లమట్టిని తీసుకువచ్చి జల్లెడ పట్టే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఈ పనులు పూర్తయి ప్లాస్టిక్ కవర్లలో మట్టిని నింపుతున్నారు. ఈ పనులన్నీ పూర్తి చేసి నెలాఖరుకు విత్తనాలు నాటే పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
17 అటవీ నర్సరీల్లో 8 లక్షల మొక్కలు..
వికారాబాద్ జిల్లా పరిధిలోని అటవీ శాఖ పరిధిలో 17 నర్సరీల్లో 8లక్షల మొక్కల పెంచుతున్నారు. ఈ నర్సరీల్లో ఇప్పటికే మొక్కల పెంపకం పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో సుమారు 5లక్షల మొక్కలు నాటడానికి అవసరమని గుర్తించారు. మిగతా వాటిలో 35 వేల మొక్కలు వికారాబాద్ మున్సిపాలిటీకి అందించేందుకు పెంపకం చేపడుతున్నారు. వీటిలో సుమారు 15వేల పెద్ద మొక్కలు సరఫరా చేస్తారు. 2023లో పెద్ద మొక్కలు నాటేందుకు వీలుగా సుమారు 3 లక్షల వరకు మొక్కలు పెంచుతున్నారు. ఈ నర్సరీల్లో పెంచిన మొక్కలు అటవీ ప్రాంతంలో నాటుతారు.
4 మున్సిపాలిటీల్లో 3.22లక్షలు మొక్కలు..
నాలుగు మున్సిపాలిటీల్లోని 16 నర్సరీల్లో 3.22లక్షల మొక్కల పెంపకం చేపడుతున్నారు. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 8 నర్సరీల్లో 1,34,875 మొక్కలు, తాండూరులోని 2 నర్సరీల్లో 91,875 మొక్కలు, పరిగిలోని 5 నర్సరీల్లో 51,250 మొక్కలు, కొడంగల్‌లోని ఒక నర్సరీలో 44వేల మొక్కలు పెంపకం చేపట్టాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. మున్సిపాలిటీల పరిధిలోని నర్సరీల్లో మట్టిని ప్లాస్టిక్ కవర్లలో నింపడం పూర్తయ్యింది. పది రోజుల్లో విత్తనాలు నాటడం కూడా పూర్తి చేయనున్నారు.
ఒక్కో మొక్కకు రూ.8 నుంచి రూ.9 ఖర్చు
మొక్కల పెంపకానికి ఒక్కో మొక్కకు సుమారు రూ.8 నుంచి రూ.9 వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నవంబర్‌లో మొక్కల పెంపకం పనులు ప్రారంభమయ్యాయి. మొక్కలకు అవసరమైన మట్టిని తెప్పించడం, జల్లెడ పట్టడం, ప్లాస్టిక్ కవర్లు కొనుగోలు చేసి వాటిలో నింపడం, విత్తనాలు నాటడం, నీరు పట్టడం తదితర ఖర్చును లెక్కించగా హరితహారంలో నాటడానికి సిద్ధం చేసే వరకు ఒక్కో మొక్కకు ఈ మేరకు ఖర్చవుతున్నది. అదనంగా మరో ఏడాది పెంచితే ఒక మొక్కకు రూ.11 వరకు ఖర్చు వస్తుంది. రూ.7.68 కోట్లు పై చిలుకు డబ్బులు మొక్కల పెంపకానికి ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. సకాలంలో మొక్కలు అందించేందుకు వీలుగా నర్సరీల్లో మొక్కల పెంపకం పనులు జరుగుతున్నాయి.
ఈ నెలాఖరు వరకు విత్తనాలు నాటడం పూర్తి
వికారాబాద్ జిల్లా పరిధిలోని 566 పంచాయతీల్లో ఈసారి 84.90లక్షల మొక్కల పెంపకానికి సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. నెలాఖరుకు ప్లాస్టిక్ కవర్లలో మట్టిని నింపి, విత్తనాలు నాటుతాం. హరితహారం ప్రారంభం నాటికి మొక్కలు ఏపుగా పెరుగుతాయి.
-కృష్ణన్, డీఆర్డీవో, వికారాబాద్ జిల్లా