హయత్నగర్ రూరల్, నవంబర్ 17: పండ్ల తోటల రైతులు, వ్యాపారులు బాటసింగారం బాట పట్టారు. నెలకిందట తాత్కాలికంగా ప్రారంభమైన ఫ్రూట్ మార్కెట్కు వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. మార్కెట్లో క్రయవిక్రయాలు ఊపందుకుంటున్నాయి. తెల్లవారకముందే మార్కెట్ వద్ద పండ్ల బండ్లు బారులు తీరుతున్నాయి. మార్కెట్ ప్రారంభమైన మొదట్లో వారంపాటు 20 నుంచి 30 వాహనాల వరకు మాత్రమే వచ్చేవి. ఆ తర్వాత వాటి సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తున్నది. వారం క్రితం రోజువారీగా మార్కెట్కు వచ్చిన వాహనాల సంఖ్య ఏకంగా 135కు చేరుకున్నది. మంగళవారం ఉదయం 9 గంటల వరకే దాదాపు 100 వాహనాలు మార్కెట్కు వచ్చాయి. దాదాపు 250 మందికిపైగా రైతులు తరలివచ్చారు. బుధవారం సైతం ఇదే ఒరవడి కొనసాగింది. ప్రధానంగా బొప్పాయి, పైనాపిల్, యాపిల్, మొసంబి, జామ, ఆరెంజ్, సపోటా మార్కెట్కు వస్తున్నది. మార్కెట్ వస్తున్న రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని మార్కెట్ కమిటీ సెక్రటరీ లబాన్ తెలిపారు. పెద్దఎత్తున పండ్లు వస్తున్నాయని చెప్పారు. సగటున వందకు పైగా వాహనాలు మార్కెట్కు వస్తున్నట్టు వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిరకాల చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.