చేవెళ్ల రూరల్, నవంబర్ 17 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గ్రామ రూపురేఖలు మారాయి. గ్రామంలో ప్రతి వీధిలో సీసీ రోడ్లు, రోడ్లకిరువైపులా హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలతో పచ్చదనంతో కళకళలాడుతున్నది. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఆహ్లాదాన్ని పంచుతున్నది. వెంకన్నగూడ గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న ఆలూరు గ్రామంలో జనాభా 5800 ఉండగా, ఓటర్లు 4455 మంది ఉన్నారు.
సమస్యలు పరిష్కారం..
గతంలో పేరుకుపోయిన సమస్యలు అన్నీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పనులతో పరిష్కారమయ్యాయి. గ్రామస్తులు స్వచ్ఛందంగా పరిశుభ్రత పాటిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ ట్రాక్టర్లో డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. అంతేకాకుండా సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు.
అభివృద్ధి పనులు..
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన నిధులు వెచ్చిస్తూ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధిలైట్లు, ఇంకుడు గుంతల నిర్మాణం తదితర పనులు పూర్తి చేసుకుని అభివృద్ధిలో దూసుకుపోతున్నది.
పచ్చందాలు..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ పాఠశాల, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మొక్కల సంరక్షణకు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి
ఆలూరు గ్రామ అభివృద్ధి గ్రామస్తుల సహకారంతోనే సాధ్యమైంది. ప్రభుత్వ సహకారంతో గ్రామంలో మరింత అభివృద్ధి చేపట్టి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా. పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. తడి, పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్ ఎరువులుగా తయారు చేస్తున్నాం.
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పనులతో గతంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారమయ్యాయి. డ్రైనేజీ, రోడ్లను శుభ్రం చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం. మొక్కల సంరక్షణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి వాటిని కాపాడుతున్నాం. తడి, పొడి చెత్త సేకరణ ట్రాక్టర్లో వేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.