స్థానిక సంస్థల ఓటర్లు…
జడ్పీటీసీలు 33
ఎంపీటీసీలు 370
కార్పొరేటర్లు 277
కౌన్సిలర్లు 466
కో-ఆప్షన్ సభ్యులు 157
మొత్తం 1303
రంగారెడ్డి, నవంబర్ 9, (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి (శంభీపూర్) రాజు పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 4తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 23 వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు చివరి తేదీ కాగా, 26 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకుగాను ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది. డిసెంబర్ 10న రెండు స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు.
మెజార్టీ ఓటర్లు టీఆర్ఎస్ వారే..
స్థానిక సంస్థల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 1303 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు ఓటర్లుగా ఉంటారు. ఈ ఓటర్లలో మెజార్టీ ఓటర్లు టీఆర్ఎస్ వారే ఉండడంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ టీఆర్ఎస్ పార్టీయే కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.