ఇబ్రహీంపట్నం, నవంబర్ 7 : వానకాలంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తున్నది. సమృద్ధిగా వర్షాలు పడడంతో నియోజకవర్గంలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రైతులు ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి సాధించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సుమారు 90లక్షల క్వింటాళ్ల వరిధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. పెరిగిన సాగుతో దిగుబడి కూడా పెరిగింది. ఎంత ఖర్చయినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో వ్యవసాయశాఖ, డీసీఎంఎస్, ఐకేపీ సంస్థలు సిద్ధమయ్యాయి. ధాన్యం దళారుల చేతికి వెళ్లకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నది.
అదనంగా నాలుగు కొనుగోలు కేంద్రాలు..
నియోజకవర్గంలో ధాన్యం దిగుబడి గణనీయంగా పెరగడంతో ప్రభుత్వం అదనంగా మరో నాలుగు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసింది. మంచాల మండలంలో నూతనంగా ఆరుట్ల, లోయపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే, యాచారం మండలంలోని నందివనపర్తి, మాల్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు పూర్తిచేశారు. నియోజకవర్గంలో ఇప్పటికి 11 కొనుగోలు కేంద్రాలున్నాయి. వీటిలో మంచాల మండలంలో నోముల, మంచాల, బోడకొండ, యాచారం మండలంలో యాచారం, చింతపట్ల, ఇబ్రహీంపట్నం మండలంలో దండుమైలారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్ మండలంలో గౌరెల్లి, బాచారం, బండరావిరాల, కొహెడ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి.
15 నుంచి కొనుగోలు ప్రారంభం..
నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న నాలుగు కేంద్రాల్లో ఈనెల 15 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తాం. పెరిగిన దిగుబడి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కొనుగోలు కేంద్రాలు సరిపోవు. రైతుల కోరిక మేరకు అదనంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. నియోజకవర్గంలో ఉన్న 15 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. మద్దతు ధరకు కొని రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తాం.
-సత్యనారాయణ, ఏడీఏ ఇబ్రహీంపట్నం