పత్తి రైతు పంట పండుతున్నది. ఈసారి పత్తికి మార్కెట్లో మంచి ధర లభిస్తుండడంతో వానకాలంలో సాగుచేసిన రైతులకు కాసులు కురుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో రైతులు కొన్నిరోజులుగా పత్తిని మార్కెట్లు, జిన్నింగ్ మిల్లులకు విక్రయానికి తెస్తున్నారు. ఆయా మార్కెట్లలో క్వింటాలుకు ధర రూ.8 వేల నుంచి రూ.8,500లకు పైనే పలుకుతున్నది. బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వరంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు చేయడం లేదు. కాగా ఈసారి రంగారెడ్డి జిల్లాలో 1,31,609 ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. సుమారుగా 10.50లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
షాబాద్, నవంబర్ 7 : తెల్ల బంగారానికి ఈ ఏడాది భలే డిమాండ్ పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్లో పత్తికి రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. క్వింటాల్‌కు మద్దతు ధర రూ. 6025 ఉండగా, బయటి మార్కెట్లో రూ.8000 నుంచి రూ.8500 వరకు ధర ఉంది. మద్దతు ధర కంటే రూ.2500 అదనంగా అందుతున్నది.
రంగారెడ్డి జిల్లాలో 1,31,609 ఎకరాల్లో పత్తి సాగు..
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, ఆమనగల్లు, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో ఈ వానకాలం సీజన్లో 1,31,609 ఎకరాల్లో పత్తి ని సాగు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సుమారు 10.50లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అధిక వర్షాల కారణంగా ఎకరాకు 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని రైతులు చెబుతున్నారు.
రికార్డు స్థాయిలో ధర..
రికార్డు స్థాయిలో పత్తి ధర పలుకుతున్నది. గతేడాది మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 5800 ఉండగా, ప్రభుత్వం ఈ ఏడాది రూ.6025లకు పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్లకు ధర ఉండడం, దేశ వ్యాప్తంగా సాగు విస్తీర్ణం తగ్గడంతో ఈ ఏడాది పత్తికి డిమాండ్ పెరిగింది. దీంతో ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో క్వింటాల్ పత్తికి రూ.8000 నుంచి రూ.8500 వరకు ఇస్తున్నారు. మద్దతు ధరకంటే రూ. 2500 అధికంగా ప్రైవేట్ వ్యాపారులు చెల్లిస్తున్నారు. అధిక ధరలు లభించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బయటి మార్కెట్ లో పత్తికి అధిక ధర ఉండటంతో జిల్లాలో ఇప్పటి వరకు సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని అధికారులు చెబుతున్నారు.
పత్తికి మంచి ధర ఉన్నది..
ఈ ఏడాది పత్తికి మంచి ధర ఉన్నది. ఐదు ఎకరాల్లో పత్తి పంట ను సాగు చేశా. ప్రస్తుతం అమ్మేందుకు సిద్ధం చేశాం. ఇంతకు ముందు క్వింటాల్ పత్తికి రూ. 5వేలకు మించి రాలేదు. ఈ ఏడాది రూ.8500 వరకు ధర రావడం సంతోషంగా ఉన్నది.
రైతులకు ఎంతో మేలు..
పత్తికి ధర పెరుగడం వల్ల రైతులకు మేలు జరు గుతున్నది. నాలుగు ఎకరాల్లో పత్తి పంట వేశా. వర్షాలకు పంట దెబ్బతిన్నా ఎకరానికి పది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుం ది. మార్కెట్లో పత్తికి మంచి ధర ఉండటంతో గిట్టుబాటు అవుతుంది.