కడ్తాల్, నవంబర్ 6 : వాతావరణంలో వస్తున్న మార్పులను అరికట్టడానికి జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలని వరంగల్ నీట్ డైరెక్టర్ రమణారావు అన్నారు. మండల పరిధిలోని అన్మాస్‌పల్లి గ్రామంలోని ఎర్త్ సెంటర్లో, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణ మార్పులపై అవగాహన సదస్సులో శనివారం వరంగల్ నీట్ డైరెక్టర్ల బృందం, సీజీఆర్ వ్యవస్థాపకులు లీలమ్మ, లక్ష్మారెడ్డి, పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి, ఎర్త్ సెంటర్ డైరెక్టర్ సాయిభాస్కర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని తెలిపారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న పెను మార్పులపై ప్రజలంందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సహజ వనరులను కాపాడుకోవాలని, మొక్కలను విరివిగా నాటాలని, నీటిని వృథా చేయరాదని వివరించారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎర్త్ సెంటర్, అన్మాస్‌పల్లి ఎర్త్ సెంటర్ల మధ్య పర్యావరణ సుస్థిర అభివృద్ధి, హరిత సాంకేతిక అంశాలవారీగా అవగాహన కల్పించేందుకు పరస్పర ఒప్పందం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు రెండు సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ, పరిశోధన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. అంతకుముందు బేగంపేట్ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన వృక్షశాస్త్రం విభాగం నుంచి డాక్టర్లు ఉషారాణి, రుక్మిణీదేవి, స్నేహ ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థినులు ఎర్త్ సెంటర్‌ను సందర్శించారు. కార్యక్రమంలో నీట్ ప్రొఫెసర్లు ప్రసాద్, బంగారిబాబు, నాగేశ్వరరావు, రమణమూర్తి, జీవవైవిధ్య శాస్త్రవేత్త డాక్టర్ తులసీరావు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ డైరెక్టర్ రాజిరెడ్డి, ప్రముఖ విశ్లేషకుడు డాక్టర్ నర్సింహారెడ్డి, ఆర్థికవేత్త డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త ఉమామహేశ్వర్‌రెడ్డి, సీజీఆర్ ప్రతినిధులు కృష్ణ, వర్ధన్, వెంకటేశ్, కోటేశ్, రజనీకాంత్ పాల్గొన్నారు.