షాబాద్, నవంబర్ 6 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో నూతన మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డిజిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బడంగ్పేట్ కమాన్ నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు రూ.9.50కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి రోడ్డును, అనంతరం పాలిటెక్నిక్ కళాశాల నుంచి నాదర్గుల్ జంక్షన్ వరకు రూ.11కోట్లతో ఆర్అండ్బీ శాఖ నిర్మించనున్న పనులకు సంబంధించి అధికారులతో కలిసి రోడ్డును పరిశీలించారు. అనంతరం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్డు విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే ప్రాంతాలను పరిశీలించి, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతామన్నారు. నూతనంగా ఏర్పడిన బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్ల పరిధిలో ప్రధాన రోడ్ల విస్తరణకు కృషి చేస్తున్నామన్నారు. పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రూ.4కోట్లతో నిర్మిస్తున్న జిల్లా గ్రంథాలయం భవన నిర్మాణం పనులను పరిశీలించి, త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. రూ.కోటిన్నరతో చేపడుతున్న క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ఆయా కార్పొరేషన్ల పరిధిలోని ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ తదితర వాటిని ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు వివరించారు. వీధి దీపాలు, డ్రైనేజీలతోపాటు తాగునీటి కోసం రూ.కోట్లు మంజూరు చేస్తున్నారన్నారు. వరదనీటి సమస్య అధిగమించడానికి చెరువుల అనుసంధానం కోసం కోట్లాది రూపాయలతో ట్రంక్ లైన్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. మున్సిపల్ నూతన భవనంతోపాటు, ప్రజా భవన్, దవాఖానల నిర్మాణం పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ పారిజాత, కార్పొరేటర్లు, అధికారులున్నారు.