షాబాద్, నవంబర్ 6 : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని శనివారం చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. జస్టిస్ సుభాష్‌రెడ్డి, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డితో కలిసి స్వామివారికి ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి, దర్శనం చేయించి, స్వామివారి శేష వస్ర్తాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత పునరుద్ధరిస్తున్న ఆలయాన్ని కుటుంబసభ్యులతో కలిసి రంజిత్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ యాదాద్రిని ఇలలో వైకుంఠపురంగా, నభూతో, నభవిష్యత్ అన్న చందంగా పునరుద్ధరిస్తున్నారని తెలిపారు. ఆలయ విశిష్ట చరిత్రను ప్రపంచానికి చాటి చెబుతున్నారన్నారు. వారు చేస్తున్న ఈ నిర్మాణంలో తమ వంతు బాధ్యతగా కిలో10గ్రాముల బంగారాన్ని ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడానికి ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించానని చెప్పారు. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆలయానికి అందజేస్తామన్నారు. ఈ బృహత్కార్యంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎంపీ రంజిత్‌రెడ్డి కోరారు.