సీరోలు(కురవి), డిసెంబర్ 15 : మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం చింతపల్లిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి జెర్రిపోతుల రంగన్నగౌడ్పై డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చింతపల్లిలో 1128 ఓట్లు ఉండగా కాంగ్రెస్ తరఫున ధరావత్ వీరన్న, కాంగ్రెస్ రెబల్‌గా జెర్రిపోతుల రంగన్నగౌడ్ నామినేషన్ వేశారు. కొత్తతండాకు రోడ్డు పూర్తికాకపోవడంతో గిరిజనులు కోపంగా ఉండటంతో వారందరినీ ఆగిపోయిన రోడ్డు వద్దకు కాంగ్రెస్ నాయకు లు సోమవారం పిలిపించారు. కాంగ్రెస్ రెబల్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు కూడా వచ్చారు.
ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేతో రెబల్ అభ్యర్థి జెర్రిపోతుల రంగన్నగౌడ్ గిరిజనుల సమక్షంలో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ రూ. కోటీ 96 లక్షలు మంజూరు చేశారని, పనులన్నీ పూర్తయి 300 మీటర్ల మేర రూ. 76 లక్షల విలువైన రోడ్డు పనులు నిలిచిపోయాయని చెప్పారు. రోడ్డు పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై రామచంద్రునాయక్ పరుషంగా మాట్లాడారు. దొంగ స్వాముల మాటలు నమ్మొద్దని, కాంగ్రెస్ అభ్యర్థి వీరన్న మాత్రమేనని స్పష్టంచేశా రు. దీంతో రెబల్ అభ్యర్థికి, ఎమ్మెల్యేకు తీవ్ర వాగ్వాదం జరిగింది. నామినేషన్ వేయకముందే కలిశానని, ఈరోజు రమ్మని పిలిచి అయ్యప్ప మాల మీద ఉన్న తనను ఇష్టమొచ్చినట్టు తిట్టాడని వాపోయాడు.
ఖమ్మం రూరల్, డిసెంబర్ 15: ఖ మ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండలం తల్లంపాడు ఉపసర్పంచ్ ఎన్నికలో హైడ్రామా చోటుచేసుకున్నది. వివరాల్లోకెళ్తే.. తల్లంపాడు పంచాయతీలో సర్పంచ్‌తోపాటు 12 వార్డు సభ్యులకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో బీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప ఓట్లతో పరాజయం పాలయ్యాడు. రీకౌంటింగ్ పెట్టాలని బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపినప్పటికీ అధికారులు వినకుండా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించినట్టు ప్రకటించేశారు.
వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు ఏడుగురు విజయం సాధించగా సోమవారం ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుందని వార్డు సభ్యులకు రిటర్నింగ్ అధికారి లిఖిత పూర్వక సమాచారం అందజేశారు. దీంతో మధ్యాహ్నం ఏడుగురు వార్డుసభ్యులు పంచాయతీ కార్యాలయానికి రాగా ఎన్నికల అధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతూ ఎన్నిక చేపట్టకపోవడంతో నిరసనకు దిగారు. ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు అక్కడికి చేరుకొని మంగళవారం ఉపసర్పంచ్ ఎన్నిక చేపడుతామని వార్డుసభ్యులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.