కంటోన్మెంట్, మే 14: ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాస్ కన్నుమూశారు. అనారోగ్యం కారణం గా మంగళవారం హైదరాబాద్ న్యూబోయిన్‌పల్లిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా ఇల్లందులోని గేటుకారేపల్లికి చెందిన రామదాసుకు తొలి నుంచే ప్రత్యేక రాష్ట్ర ఏర్పా టు కాంక్ష ఉండేది. జిల్లాలన్నీ తిరిగి నాయకులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులను ఐక్యం చేశారు. 1969లో ఖమ్మంలోని డిగ్రీ విద్యార్థి రవీంద్రనాథ్‌తో రెండువారాలు ఆమరణ దీక్ష చేయించి, తెలంగాణ సాధన ఆవశ్యకతను చాటిచెప్పి తొలిదశ ఉద్యమానికి ఆజ్యం పోశారు. ఖమ్మం ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ నినాదాన్ని అందించడమే కాకుండా, తెలంగాణ ప్రాంతీయ పార్టీని స్థాపించారు. అనంతరం సింగరేణిలో పనిచేశారు. ఆయనకు కుమారులు మాధవ్, రఘువీర్, కుమార్తెలు శ్రీదేవీమాధవి, శ్రీలత ఉన్నారు. న్యూబోయిన్‌పల్లి బాపూజీనగర్ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.
రామదాస్ మృతి తీరనిలోటు: వీ ప్రకాశ్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తొలి దశ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాస్ మృతి తెలంగాణకు తీరనిలోటని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, రాజకీయ విశ్లేషకులు వీ ప్రకాశ్ పేర్కొన్నారు. బోయిన్‌పల్లిలో రామదాస్ భౌతికకాయాన్ని ప్రకాశ్ సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ 1969 కంటే రెండే ండ్ల ముందు నుంచే రామదాస్ ఉద్యమాన్ని నడిపారని కొనియాడారు. పెద్ద మనుషుల ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న తరుణంలో తెలంగాణ ప్రాంతీయ రక్షణ సమితి పేరిట ఇల్లందులో ఓ కార్యాలయాన్ని తెరిచారని గుర్తు చేశారు. అలాంటి ఉద్యమ నేత గురించి తెలంగాణ సమాజం తెలుసుకోవాలన్నారు.