Farmers Protest | వ్యవసాయానికి కనీసం 8 గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. రామాయంపేట–ఎల్కతుర్తి జాతీయ రహదారిపై విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది.
ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉందని, ఈ సమయంలో నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 8 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నా.. ఎప్పుడు సరఫరా నిలిచిపోతుందో, ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. విద్యుత్ సరఫరాను నిరంతరాయంగా అందించాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాను సక్రమంగా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకోతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్సై బాలరాజు అక్కడకు చేరుకుని రైతులను సముదాయించి, ఆందోళనను విరమింపజేశారు. అనంతరం ట్రాఫిక్ పునరుద్ధరించారు.