రైలు కూత ఎప్పుడు వినిపిస్తుంది? తాము ఎన్నడు ప్రయాణించేది? ఇది కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజల్లో ఏళ్ల తరబడిగా ఉన్న కోరిక. బొగ్గుతో పాటు ప్రజా రవాణాకు అనుకూలమైన రామగుండం-మణుగూరు కొత్త రైల్వేలైన్ ఏర్పాటు కలగానే మిగులుతున్నది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రైలు మార్గం సర్వే కోసం నిధులు మంజూరు చేయడం.. ప్రక్రియ మొదటికి రావడం పరిపాటిగా మారింది. అటవీ శాఖ అభ్యంతరాలు.. ఏటా బడ్జెట్లో కేటాయింపుల కోసం ఎదురుచూపులతోనే కాలం గడిచిపోతున్నది.
కొద్ది నెలల క్రితం ఈ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. రైల్వే శాఖ సర్వే కోసం నిధులు కేటాయించి.. ఆర్డీవోలకు భూసేకరణ బాధ్యతలు అప్పగించింది. అయితే ఇందుకు సంబంధించి విధివిధానాలు, రూట్‌మ్యాప్ అందించకపోవడంతో ఆర్డీవోలు క్షేత్రస్థాయిలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కాగా, శనివారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ రైల్వే లైన్‌కు నిధులు కేటాయించేనా? పాతికేళ్ల తమ నిరీక్షణ ఫలించేనా అని కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి, జనవరి 31 (నమస్తే తెలంగాణ)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాను కలుపుకుంటూ పోయే రామగుండం-మణుగూరు రైలు మార్గం ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమవుతున్నది. ఈ రైల్వే లైన్ సర్వే కోసం 2014లో కేంద్రం రూ. 10 కోట్లు కేటాయించింది. అప్పటి నుంచి 2017 వరకు సర్వే కొనసాగి మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికే కోట్లాది రూపాయలు సర్వే కోసం రైల్వే శాఖ వెచ్చించినా ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇటీవల రైల్వేశాఖ రూ. 2,911 కోట్లతో అంచనాలు రూపొందించి సర్వేకు ఆదేశించింది. రామగుండం నుంచి మణుగూరు వరకు 207.80 కిలోమీటర్ల పొడవునా సర్వే చేసి, భూ సేకరణ జరపాలని రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాలోని మల్హర్, భూపాలపల్లి, గణపురంతో పాటు పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం, మంథని, రామగిరి మండలాల పరిధిలో సర్వే చేయాలని ఆర్డీవో, సబ్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది. అయితే భూ సేకరణకు సంబంధించి రైల్వే శాఖ ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయకపోవడం, ఏయే గ్రామాల నుంచి రైలు మార్గం వెళ్తుందో రూట్ మ్యాప్ ఇవ్వకపోవడంతో అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేయలేకపోతున్నారు. దీంతో ఈ సారైనా కొత్త రైల్వే మార్గానికి నిధుల కేటాయింపు జరిగేనా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
రామగుండం-మణుగూరు కొత్త రైల్వే లైన్‌తో బొగ్గు రవాణా సౌకర్యంతో పాటు ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. ఈ మార్గం పూర్తయితే మణుగూరు , భూపాలపల్లి ఏరియా నుంచి సుమారు 70 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా అవుతుంది. ఈ క్రమంలో ఈ ప్రాంతం కోల్ కారిడార్‌గా అభివృద్ధి చెందే అవకాశముంది. మణుగూరు నుంచి రామగుండం వరకు 9 రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేసే వీలుందని సింగరేణి అధికారులు చెబుతున్నారు.
బొగ్గుతో పాటు ప్రయాణికుల రైళ్లు నడిపితే భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి ప్రాంత ప్రజలకు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు మేడారం జాతర భక్తులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. రామగుండం నుంచి వయా కొత్తగూడెం మీదుగా మణుగూరు వెళ్లాలంటే 349 కిలోమీటర్లు ఉంటుంది. కొత్తగా ఏర్పాటు చేసే రైల్వేలైన్ 207 కిలోమీటర్లు ఉండనుండగా త్వరగా గమ్యం చేరుకోవచ్చు.