Ram Charan |చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనదైన టాలెంట్‌తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ చిత్రాలలో రామ్ చరణ్ నటన చూసి పరవశించని వారు లేరు. ఇప్పుడు పెద్ది అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఈ చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇందులో రామ్ చరణ్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రంతో చెర్రీ మరోసారి తన టాలెంట్ ప్రదర్శించడం ఖాయం అంటున్నారు. అయితే గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఆయన మైనపు విగ్రహం లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మే 9న ఆవిష్కరించనున్నారు.
రామ్‌చరణ్‌కు దక్కిన ఈ గౌరవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు మెగా ఫ్యామిలీ అంతా లండన్‌లో వాలారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్- ఉపాసన దంపతులు, కుమార్తె క్లీన్ కారా, పెంపుడు శునకం రైమ్ లండన్‌లో ప్రత్యక్షం అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖుల మైనపు విగ్రహాలని లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచుతారన్న విషయం మనందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రతిష్ఠాత్మక మ్యూజియంలో టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం కూడా కొలువుదీరనుండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.
మే 11న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో RRR సినిమాని ప్రదర్శించనున్నారు. అక్కడ కీరవాణితో RRR సాంగ్స్ ఆర్కెస్ట్రా నిర్వహించి, రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో క్వశ్చన్ – ఆన్సర్స్ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. అంటే దాదాపు వారంకి పైగా మెగా ఫ్యామిలీ అంతా లండన్‌లో ఉండనున్నట్టు తెలుస్తుంది. తిరిగి వచ్చాక రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. ఇప్పటికే పెద్ది గ్లింప్స్ విడుదల కాగా, ఇది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రామ్ చరణ్ క్రికెట్ షాట్ అయితే తెగ వైరల్ అయింది.