Rajiv Yuva Vikasam | రామవరం, ఏప్రిల్ 13: రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియలో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ సమస్య ఉండటంతో పాటు వెబ్సైట్ సరిగ్గా పనిచేయకపోవడంతో అప్లై చేయడం కుదరడం లేదు. ఈ క్రమంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా డిమాండ్ చేశారు.
వెబ్ సైట్ మందకొడిగా పనిచేస్తుండటంతో రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకుంటున్న దరఖాస్తు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని యాకూబ్ పాషా అన్నారు. ఆన్లైన్ సక్రమంగా పనిచేయని కారణంగా వేల సంఖ్యలో దరఖాస్తుదారులు నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. కావున ప్రభుత్వం వెంటనే ఆన్లైన్ గడువును పొడిగించాలని కోరారు. పథకం పట్ల దరఖాస్తుదారులకు సరైన అవగాహన లేకపోవడంతో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రాకపోవడానికి ఒక కారణం అవుతుందని, రాజీవ్ యువ వికాసం పథకం పట్ల అవగాహన కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని మండిపడ్డారు. అధికారుల తీరుతో ప్రభుత్వ లక్ష్యం నీరు గారే అవకాశం ఉందని అన్నారు. తక్షణమే ఆన్లైన్ గడువు పెంచడంతోపాటు, ప్రజలకు ఈ పథకం పట్ల అవగాహన కల్పించేలా అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.