నల్లగొండ ప్రతినిధి, జూలై 5 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డికి, కాంగ్రెస్‌కు మధ్య దూరం పెరుగుతున్నదని రాజకీయవర్గాల్లో ప్రచారం నడుస్తున్నది. మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో రాజగోపాల్ అలిగినట్టు తెలుస్తున్నది. పార్టీలో చేర్చుకున్నప్పుడు, ఎంపీ ఎన్నికలప్పుడు మంత్రి పదవి ఆశచూపిన కాంగ్రెస్.. మోసం చేసిందని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొంటున్న ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఆయన ఉంటున్నారు. తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే హైదరాబాద్‌లో సభ పెట్టినా రాజగోపాల్ పట్టించుకోకపోవడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఈ నెల 3న హైదరాబాద్ వచ్చారు. మంత్రి పదవులు ఆశిస్తున్న సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, బాలునాయక్, రామ్మోహన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి… ఖర్గే వద్ద తమ వాదన వినిపించారు. ఖర్గేతో భేటీ కావాలని పార్టీలోని కొందరు నేతలు సూచించినా రాజగోపాల్‌రెడ్డి పట్టించుకోలేదని తెలిసింది. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, సలహా సంఘంతోనూ ఖర్గే సమావేశమయ్యారు. అక్కడ కూడా రాజగోపాల్‌రెడ్డి కనిపించలేదు. ఎల్బీ స్టేడియంలో మండ ల, గ్రామశాఖల అధ్యక్షులు, కీలక నేతల బహిరంగసభను రాజగోపాల్‌రెడ్డి పట్టించుకోలేదు. మునుగోడు నియోజకవర్గం నుంచి కూడా కార్యకర్తలు పెద్దగా హాజరుకాలేదు. ఎల్బీ స్టేడియం మీటింగ్‌కు వెళ్లాలని కార్యకర్తలకు రాజగోపాల్ ఎలాంటి పిలుపునివ్వలేదు.
ఇటీవల నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి రాజగోపాల్‌రెడ్డి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. తన సోదరుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కూడా మునుగోడు లో అడుగుపెట్టనివ్వలేదని తెలుస్తున్నది. రాజగోపాల్‌రెడ్డి అనుమతి లేకుండా మంత్రులు, ఎంపీలు మునుగోడుకు వెళ్లాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని చర్చ జరుగుతున్నది. పార్టీకి రాజగోపాల్‌రెడ్డి క్రమంగా దూరం జరుగుతున్నారని ప్రచారం జరుగుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యేవరకు వేచిచూసి, అప్పటి పరిస్థితిని బట్టి తగిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు రాజగోపాల్‌రెడ్డి సన్నిహితవర్గాలు చెప్తున్నాయి.