హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ ప్రస్తుతం బంగాళాఖాతం దిశగా పయనిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో దేశంలో కొంతకాలంగా బలహీనపడిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకోనున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో జరుగుతున్న మార్పులతో సముద్రపు గాలులు బలంగా వీస్తూ దట్టమైన మేఘాలు అలుముకోనున్నట్టు తెలిపారు.
రెండు మూడు రోజుల్లో ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని, ఇది క్రమంగా ఒడిశా, బెంగాల్ తీరాల వైపు పయనించి తూర్పు భారతదేశంలో వర్షాలు కురువనున్నట్టు వెల్లడించారు. జూలై మొదటి వారంలో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో వర్షాలు కురిసినా.. ఆ తర్వాత రుతుపవనాల్లో స్తబ్ధత ఏర్పడింది.
దీంతో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే పడిపోవడమే కాకుండా, ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో మారిన పరిస్ధితులు ఊరటనిచ్చే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. నేటి నుంచి మొదలయ్యే వర్షాలు గురువారం జోరందుకుంటాయని, జూలై 19 వరకు కొనసాగుతాయని అంచనావేశారు.