
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): వాయుగుండం తెలంగాణకు దూరంగా వెళ్లిపోవడంతో రాష్ర్టానికి తుఫాన్ ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగామారి తమిళనాడు, ఏపీలలో బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున పుదుచ్చేరి, చెన్నై మధ్యలో వాయుగుండం తీరాన్ని దాటింది. ఉదయం 8.30 గంటలకు వెల్లూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని, ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
వాయుగుండం నుంచి ఉపరితలద్రోణి కోస్తాంధ్ర మీదుగా ఒడిశా వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించినట్టు పేర్కొన్నారు. తూర్పు దిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని చెప్పారు. వాతావరణంలో మార్పుల వల్ల తెలంగాణకు తుఫాన్ ముప్పు తప్పిందని, కానీ శుక్రవారం రాత్రి నుంచి మూడు రోజులపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోని ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు.