సూర్యాపేట, అక్టోబర్ 2 : కొద్దిరోజుల నుంచి భానుడి భగభగతో అల్లాడి పోతున్న ప్రజలు బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో ఉపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వారం నుంచి దాదాపు 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. ఎండ వేడి, ఉక్కపోతకు జనం తీవ్ర అవస్థ పడ్డారు. వానకాలమైనా వాతావరణ పరిస్థితులు అలా లేకపోవడంతో ఎప్పుడు వర్షం వస్తుం దా అని ఎదురుచూశారు. బుధవారం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షం పడడంతో కొంత ఊరట పొందారు. తిరుమలగిరి మండలంలో 6 సెంటీమీటర్లు, నడిగూడెం, సూర్యాపేటలో 4, అనంతగిరి, నాగారంలో 2, మద్దిరాల, ఆత్మకూర్.ఎస్ మండలంలో ఒక్క సెంటీమీటరు చొప్పున వర్షపాతం నమోదైంది. చివ్వెంల, నూతనకల్, జాజిరెడ్డిగూడెంలో సెంటీమీటరులోపు వర్షం పడింది.
పిడుగుపాటుతో ఆవుల మృత్యువాత
కట్టంగూర్ : కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం గ్రామంలో పిడుగుపడి రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన సూరారపు స్వరాజ్యం ఊరి శివారులోని చెరువు సమీపంలో ఆవులను మేపుతుండగా.. పిడుగు పడి రెండు ఆవులు చనిపోయాయి. స్వరాజ్యం కొంత దూరంగా ఉండడంతో ప్రాణాలతో బయట పడింది. లక్ష రూపాయల నష్టం జరిగిందని బాధిత రైతు ఆమె ఆవేదన చేసింది.
నేలకొరిగిన వరి
కేతేపల్లి : కేతేపల్లి మండలంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో కోతకు వచ్చిన దశలో ఉన్న వరి పైర్లు నేలవాలాయి. పత్తి చేలల్లోనూ భారీగా నీరు నిలిచింది.