హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపింది. గడిచిన 24 గంటల్లో మెదక్ జిల్లా శంకరంపేటలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.