హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని పోలింగ్స్టేషన్ల పరిధిలో గ్రామ, వార్డుసభలను పారదర్శకంగా నిర్వహించాలని సీఈవో సీ సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డుసభల్లో అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ (ఏఎస్‌డీడీ) క్యాటగిరీల్లో గుర్తించిన ఓటర్ల వివరాలను బూత్‌లెవల్ అధికారులు (బీఎల్వో) బహిరంగంగా చదివి వినిపించాలని సూచించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో కొత్తగా చేర్చిన ఓటర్ల పేర్లను కూడా సభల్లో చదివి వినిపించాలని చెప్పారు.
ముసాయిదా ఓటర్ల జాబితా, ‘సర్’లో భాగంగా చేపడుతున్న ప్రక్రియపై హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి సోమవారం ఆయన అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు(డీఈవోలు), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(ఈఆర్వోలు), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల(ఏఈఆర్వోలు)తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గ్రామ, వార్డుసభల ఏర్పాటు, నిర్వహణతోపాటు అనామలిస్, లాజికల్ డిస్రెపెన్సీస్ ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేయడం, హియరింగ్‌లు నిర్వహించడం తదితర అంశాలపై సీఈవో అధికారులకు పలు సూచనలు చేశారు. 2026 అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండే అర్హత కలిగిన పౌరులు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.