ప్రైవేట్-ఐఆర్సీటీసీ భాగస్వామ్యంతో 190 రైళ్ల ప్రారంభం: రైల్వేమంత్రి
భారత సంస్కృతి, వారసత్వానికి ప్రచారం కల్పించడమే లక్ష్యం
న్యూఢిల్లీ, నవంబర్ 23: సరుకు, ప్రయాణికుల రవాణా విభాగాల్లో సమర్థవంతమైన సేవలను అందిస్తున్న భారతీయ రైల్వే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మరో విభాగాన్ని ప్రారంభించబోతున్నది. ‘భారత్ గౌరవ్’ పేరిట 190 థీమ్ బేస్డ్ రైళ్లను (3,033 కోచ్లు) ప్రారంభించబోతున్నట్టు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం తెలిపారు. ప్రైవేటు, ఐఆర్సీటీసీ సంయుక్త భాగస్వామ్యంతో ఈ రైళ్లు నడుస్తాయన్నారు. అయితే, సాధారణ రైళ్లలాగా టైమ్ టేబుల్ ప్రకారం ఈ రైళ్లు నడువబోవని చెప్పారు.
భారత సంస్కృతి, వారసత్వాన్ని దేశ, విదేశాల ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ రైళ్లను తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. ఒడిశా, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైళ్ల ప్రారంభంపై ఆసక్తి కనబరుస్తున్నాయని, మంగళవారం నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. టికెట్ ధరను రైళ్లను నడిపే టూర్ ఆపరేటర్లే నిర్ణయిస్తారన్నారు. ధర విషయంలో ఆందోళన అక్కర్లేదని, దీనిపై రైల్వేశాఖ పర్యవేక్షణ ఉంటుందని వివరించారు.