MUDA Scam | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ముడా కుంభకోణానికి సంబంధించి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటిస్తూ తనకు అండగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి మాత్రం సరైన సంఘీభావం లభించకపోవడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసహనంతో ఉన్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ విషయంపై ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయకపోవడాన్ని సిద్ధరామయ్య జీర్ణించుకోలేకపోతున్నట్టు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అదానీ, బెంగాల్లో వైద్యురాలి హత్యాచార ఘటన, ఇలా దేశంలోని ప్రతీ అంశంపై స్పందిస్తున్న రాహుల్.. తనకు మద్దతుగా ఒక్క ప్రకటన కూడా చేయకపోవడంపై సిద్ధరామయ్య అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తున్నది.
దీంతో ఈ విషయంపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని ఆయన నిర్ణయించుకొన్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే శుక్రవారం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వరతో కలిసి ఆయన హస్తినకు వెళ్లి రాహుల్‌తో భేటీ అయినట్టు తెలుస్తున్నది. కాగా, ఈ భేటీలో ముడా స్కామ్‌లో అధిష్ఠానం నుంచి మద్దతు, ఈ కేసులో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలి? బీజేపీ కుట్రలను తిప్పికొట్టే వ్యూహం తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నది.
తొలుత ఖర్గే కూడా..
ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యను విచారించడానికి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ గత శనివారం అనుమతి ఇచ్చిన సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా బెంగళూరులోనే ఉన్నారు. దీనిపై మీడియా ప్రశ్నించగా.. ‘గవర్నర్ నిర్ణయం నాకు తెలియదు. న్యాయవాదులతో చర్చించిన తర్వాతే మాట్లాడుతా’ అంటూ వెళ్లిపోవడం సిద్ధరామయ్యకు షాకిచ్చింది. దీంతో సిద్ధరామయ్య వర్గం ఖర్గే తీరును ఎండగట్టింది. దీంతో ‘బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్రం కుట్రలకు దిగుతున్న’దంటూ ఖర్గే ప్రకటన చేయాల్సి వచ్చింది.
ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యపై కోర్టు ధిక్కరణ కేసు
ముడా కేసులో సిద్ధరామయ్యపై ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. తనకు ఖరీదైన ప్రాంతంలో స్థలాన్ని కేటాయించమని ముడా అధికారులకు సిద్ధరామయ్య భార్య పార్వతి లేఖ రాశారని స్నేహమయి కృష్ణ అనే వ్యక్తి తన పిటిషన్లో ఆరోపించారు. లేఖలో కీలక సమాచారాన్ని వైట్నర్తో కొట్టివేశారని, కోర్టుకు ఈ విషయాలు తెలియజేయకుండా సిద్ధరామయ్య ఉపశమనం పొందారని ఆరోపించారు.