Rahul Gandhi : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఇండియా కూటమి (INDI Bloc)’ ఢిల్లీలో చేపట్టిన నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. గురువారం సైతం విపక్ష ఎంపీలు తమ ఆందోళనలను కొనసాగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi).. మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, జ్ఞానేశ్ కుమార్లపై తీవ్ర విమర్శలు చేశారు.
ఆ నలుగురూ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. వారికి కచ్చితంగా శిక్ష పడుతుందని, అది మీరంతా చూస్తారని, ఇది నా హామీ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. తొలిరోజు తమను ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారని చెప్పారు. రెండోరోజు జంతర్ మంతర్‌కు వెళ్లనివ్వలేదని, ఎంపీలపై దాడి చేశారని తెలిపారు.
నిరసనల్లో భాగంగా విపక్ష ఎంపీలు ఇవాళ తొలుత రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ అంశంపై తదుపరి కార్యాచరణకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో విపక్ష ఎంపీలు భేటీ కానున్నారు. ఇందుకోసం ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణల గురించి రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించనున్నారు.