బెంగళూర్ : కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ పేద రైతులను విస్మరిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. అంబానీ, అదానీ వంటి బడా పారిశ్రామికవేత్తల బ్యాంకు రుణాలను మాఫీ చేస్తున్నారని మరి రైతుల బ్యాంకు రుణాలను ఎందుకు మాఫీ చేయరని కాంగ్రెస్ నేత నిలదీశారు.
అదానీ, అంబానీలకు ఇవాళ వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలున్నాయని, వారి రుణాలను సులభంగా మాఫీ చేస్తున్నారు కానీ రైతులను మాత్రం విస్మరిస్తున్నారని రైతు రుణాలను కూడా మాఫీ చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెలగావి జిల్లా రామ్దుర్గ్ ప్రాంతంలో చెరకు రైతులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చెరకు రైతుల సమస్యలు పరిష్కరిస్తామని, గిట్టుబాటు ధరలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
రైతులకు మద్దతు ధర కల్పించడం లేదని, మరోవైపు గ్యాస్, ఇంధన ధరలు భగ్గుమంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీతో చిన్న వ్యాపారాలు కుదేలవుతున్నాయని, సంపన్నులకు మేలు చేసేలా పన్ను వ్యవస్ధ తీసుకువచ్చారని అన్నారు. ప్రధాని మోదీ దేశ వ్యాపారాలు, డబ్బు అంతటినీ కొద్దిమంది గుప్పిట్లో ఉంచడంతో వారు ఇష్టానుసారం ప్రజలపై ధరల భారం మోపుతున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం తగ్గించడం లేదని తప్పుపట్టారు. దేశంలో ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నారని అన్నారు.
Read More