Rahul Gandhi : లోక్‌సభలో మంగళవారం మధ్యాహ్నం ఓ వ్యక్తిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఫైరయ్యారు. ఫొటోలు ఎందుకు తీస్తున్నావంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే అతను తాను ఫోన్ చెక్ చేస్తున్నానని, ఫొటోలు తీయడం లేదని అన్నాడు. దాంతో రాహుల్‌గాంధీ.. నువ్వు అబద్ధం చెబుతున్నావని, పార్లమెంటులో అబద్ధాలు చెప్పవద్దని అతడిని హెచ్చరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఆ వీడియోలో.. రాహుల్‌గాంధీ లోక్‌సభ లాబీలో కూర్చుని ఉన్నాడు. ఇతర ఎంపీలు ప్రమాణస్వీకారాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎవరో ఒకరు ఫొటోలు తీయడాన్ని గమనించిన రాహుల్‌గాంధీ.. ‘ఎందుకు ఫొటోలు తీస్తున్నావ్..?’ అని ప్రశ్నించాడు. అందుకు అతను తాను ఫొటోలు తీయడం లేదని, ఫోన్ చెక్ చేస్తున్నానని బదులిచ్చాడు. దాంతో రాహుల్‌గాంధీ ‘పార్లమెంట్లో అబద్ధాలు చెప్పొద్దు. నువ్వు అబద్ధమాడుతున్నావ్’ అని వార్నింగ్ ఇచ్చాడు.
అయితే ఈ వీడియోలో రాహుల్‌గాంధీ, అతని వెనుక ఉన్న మిగతా లోక్‌సభ సభ్యులు, లోక్‌సభ ప్రొటెం స్పీకర్, పోడియం ముందున్న లోక్‌సభ సిబ్బంది మాత్రమే కనిపిస్తున్నారు. రాహుల్‌గాంధీ ఎవరితోనైతే వాగ్వాదం చేశాడో ఆ వ్యక్తి కనిపించడంలేదు. కానీ అతని మాటలు మాత్రం అస్పష్టంగా వినిపిస్తున్నాయి. అయితే రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి లోక్‌సభ సభ్యుడా.. లేదంటే మరొకరా అనేది క్లారిటీ లేదు.